
New Zealand Women Vs India Women 4th Odi, 2022: 50 ఓవర్ల మ్యాచ్ వర్షంతో 20 ఓవర్లకు మారినా భారత మహిళల జట్టు రాత మాత్రం మారలేదు. న్యూజిలాండ్ చేతిలో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన మిథాలీ రాజ్ బృందం మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకొని పరాజయ అంతరాన్ని 0–4కు పెంచింది. మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో కివీస్ 63 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. వాన కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అమేలియా కెర్ (33 బంతుల్లో 68 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు సుజీ బేట్స్ (26 బంతుల్లో 41; 7 ఫోర్లు), సాటర్త్‌వైట్ (16 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సోఫీ డివైన్ (24 బంతుల్లో 32; 6 ఫోర్లు) కూడా ధాటిగా ఆడి జట్టుకు భారీ స్కోరు అందిం చారు. అనంతరం భారత్ 17.5 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది. రిచా ఘోష్ (29 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించగా, మిథాలీ రాజ్ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. అమేలియా కెర్, హేలీ జెన్సన్ చెరో 3 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశారు. చివరిదైన ఐదో వన్డే గురువారం ఇక్కడే జరుగుతుంది.
రిచా పోరాటం వృథా
మూడో వన్డే ఆడిన జట్టులో ఐదు మార్పులతో భారత్ బరిలోకి దిగింది. హర్మన్‌కౌర్‌పై ఎట్టకేలకు వేటు వేసిన మేనేజ్‌మెంట్ అనూహ్యంగా స్మృతిని కాకుండా దీప్తి శర్మను వైస్ కెప్టెన్‌గా నియమించడం విశేషం. భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మన టీమ్‌కు ఏదీ కలిసి రాలేదు. వరుసగా తొలి మూడు ఓవర్లలో షఫాలీ వర్మ (0), యస్తిక (0), పూజ (4) అవుటయ్యారు. ఈ పర్యటనలో తొలి మ్యాచ్ ఆడుతున్న స్మృతి (13) కూడా ఎక్కువసేపు నిలబడలేకపోవడంతో భారత్ స్కోరు 19/4కు చేరింది. ఈ దశలో మిథాలీ, రిచా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రిచా వరుస బౌండరీలతో చెలరేగిపోయింది. ఫోర్‌తో ఖాతా తెరిచిన ఆమె తాను ఆడిన తొలి 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టింది. ఒక దశలో వరుసగా నాలుగు ఓవర్లలో ఆమె ఒక్కో సిక్స్ చొప్పున బాదడం విశేషం. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న రిచా భారత్ తరఫున వన్డేల్లో వేగవంతమైన ఫిఫ్టీని నమోదు చేసింది. 2008లో రుమేలీ ధార్ 29 బంతుల (శ్రీలంకపై) రికార్డును రిచా సవరించింది. అయితే వరుస ఓవర్లలో రిచా, మిథాలీ వెనుదిరగడంతో భారత్ గెలుపు ఆశలు కోల్పోయింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించగా... 32 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు పడ్డాయి.