రెండో వన్డేలో కివీస్ విజయం
మిచెల్ 131 నాటౌట్, యంగ్ 87
7 వికెట్లతో ఓడిన భారత్
కేఎల్ రాహుల్ సెంచరీ వృథా
ఆదివారం మూడో వన్డే
భారత్ వరుసగా గత ఎనిమిది వన్డేల్లో న్యూజిలాండ్‌ను ఓడిస్తూ వచ్చి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎట్టకేలకు ఈ జోరును కివీస్ ముగించగలిగింది. ముందుగా సమష్టి బౌలింగ్‌తో భారత్‌కు 300 పరుగులు కూడా దాటనీయకుండా నిలువరించిన జట్టు... ఆ తర్వాత మిచెల్, విల్ యంగ్ పదునైన బ్యాటింగ్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది. మన బౌలర్లంతా విఫలం కాగా, అంతకుముందు కేఎల్ రాహుల్ చేసిన అజేయ సెంచరీ వృథా అయింది.
రాజ్‌కోట్: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ 1–1తో సమమైంది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో కివీస్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (92 బంతుల్లో 112 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించాడు. కెపె్టన్ శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 56; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ నమోదు చేశాడు.
అనంతరం న్యూజిలాండ్ 47.3 ఓవర్లలో 3 వికెట్లకు 286 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డరైల్ మిచెల్ (117 బంతుల్లో 131 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), విల్ యంగ్ (98 బంతుల్లో 87; 7 ఫోర్లు) మూడో వికెట్‌కు 25.2 ఓవర్లలో 162 పరుగులు జోడించి జట్టు గెలుపును సులువు చేశారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే ఆదివారం ఇండోర్‌లో జరుగుతుంది.
కీలక భాగస్వామ్యాలు...
భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ (38 బంతుల్లో 24; 4 ఫోర్లు), గిల్ నెమ్మదిగా ప్రారంభించారు. ఫలితంగా తొలి 5 ఓవర్లలో 10 పరుగులే వచ్చాయి. అయితే తాను ఆడిన తర్వాతి 10 బంతుల్లో రోహిత్ 4 ఫోర్లు కొట్టగా, ఫోక్స్ ఓవర్లో గిల్ వరుసగా 4, 6 కొట్టడంతో 3 ఓవర్లలో భారత్ 33 పరుగులు రాబట్టింది. 10 ఓవర్లలో జట్టు స్కోరు 57 పరుగులకు చేరింది. 70 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం తర్వాత రోహిత్ వెనుదిరగ్గా, 47 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ పూర్తయింది.
ఈసారి విరాట్ కోహ్లి (29 బంతుల్లో 23; 2 ఫోర్లు) ఎక్కువ ప్రభావం చూపలేకపోయాడు. గత ఐదు ఇన్నింగ్స్‌లలో వరుసగా 74, 135, 102, 65, 93 చేసిన అతను ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీ అందుకోలేకపోయాడు. కివీస్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతో 19 పరుగుల వ్యవధిలో భారత్ గిల్, శ్రేయస్ అయ్యర్ (8), కోహ్లి వికెట్లు కోల్పోయింది. మధ్య ఓవర్లలో న్యూజిలాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒక దశలో 62 బంతుల పాటు ఒక్క ఫోర్ కూడా రాలేదు!
ఇలాంటి స్థితిలో రాహుల్ రెండు కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. ముందుగా జడేజా (44 బంతుల్లో 27; 1 ఫోర్)తో ఐదో వికెట్‌కు 73 పరుగులు జోడించిన రాహుల్... ఆ తర్వాత ఆరో వికెట్‌కు నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 20; 1 సిక్స్)తో 57 పరుగులు జత చేశాడు. హర్షిత్ రాణా (2) విఫలం కాగా 48 ఓవర్లు ముగిసేసరికి రాహుల్ 88 పరుగులతో ఉన్నాడు. జేమీసన్ వేసిన 49వ ఓవర్లో తొలి 5 బంతుల్లో 8 పరుగులు రాబట్టిన అతను... ఆఖరి బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్సర్‌గా మలచి 87 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
బౌలర్లు విఫలం...
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ కూడా ఆరంభంలో తడబడింది. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో భారత్ పేస్ బౌలింగ్‌నే ఎక్కువసేపు కొనసాగించింది. పేసర్లే వేసిన తొలి 15 ఓవర్లలో కివీస్ 64 పరుగులు మాత్రమే చేసి కాన్వే (16), నికోల్స్ (10) వికెట్లు కోల్పోయింది. అయితే మిచెల్, యంగ్ పట్టుదలగా క్రీజ్‌లో నిలబడి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముందుగా నిలదొక్కుకోవడంపై దృష్టి పెట్టిన వీరిద్దరు ఆ తర్వాత స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబట్టారు.
ఈ క్రమంలో ముందుగా మిచెల్ 52 బంతుల్లో, ఆ తర్వాత యంగ్ 68 బంతుల్లో హాఫ్ సెంచరీలను అందుకున్నారు. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. కుల్దీప్ బౌలింగ్‌లో 80 పరుగుల వద్ద మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద ప్రసిధ్ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచి్చంది. ఎట్టకేలకు కుల్దీప్ తర్వాతి ఓవర్లో యంగ్ వెనుదిరగడం భారత్‌కు కాస్త ఊరటనిచి్చంది. అయితే మిచెల్ మాత్రం తగ్గలేదు. 96 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అతను... గ్లెన్ ఫిలిప్స్ (25 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు 1 సిక్స్)తో కలిసి మరో 15 బంతులు మిగిలి
ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) యంగ్ (బి) క్లార్క్ 24; గిల్ (సి) మిచెల్ (బి) జేమీసన్ 56; కోహ్లి (బి) క్లార్క్ 23; అయ్యర్ (సి) బ్రేస్‌వెల్ (బి) క్లార్క్ 8; రాహుల్ (నాటౌట్) 112; జడేజా (సి అండ్ బి) బ్రేస్‌వెల్ 27; నితీశ్ రెడ్డి (సి) ఫిలిప్స్ (బి) ఫోక్స్ 20; హర్షిత్ (సి) బ్రేస్‌వెల్ (బి) లెనాక్స్ 2; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 284.
వికెట్ల పతనం: 1–70, 2–99, 3–115, 4–118, 5–191, 6–248, 7–256.
బౌలింగ్: జేమీసన్ 10–2–70–1, ఫోక్స్ 9–0–67–1, క్లార్క్ 8–0–56–3, లెనాక్స్ 10–0–42–1, బ్రేస్‌వెల్ 10–1–34–1, ఫిలిప్స్ 3–0–13–0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (బి) హర్షిత్ 16; నికోల్స్ (బి) ప్రసిధ్ 10; యంగ్ (సి) నితీశ్ (బి) కుల్దీప్ 87; మిచెల్ (నాటౌట్) 131; ఫిలిప్స్ (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (47.3 ఓవర్లలో 3 వికెట్లకు) 286. వికెట్ల పతనం: 1–22, 2–46, 3–208.
బౌలింగ్: సిరాజ్ 9–0–41–0, హర్షిత్ 9.3–1–52–1, ప్రసిధ్ 9–0–49–1, నితీశ్ రెడ్డి 2–0–13–0, జడేజా 8–0–44–0, కుల్దీప్ 10–0–82–1.


