టీమిండియా చేతిలో పరాజయం.. టాప్‌ ర్యాంక్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌ | Sakshi
Sakshi News home page

ICC ODI Rankings: టీమిండియా చేతిలో పరాజయం.. టాప్‌ ర్యాంక్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌

Published Sat, Jan 21 2023 9:36 PM

New Zealand Lose Top Spot In ODI Rankings After Defeat To India In 2nd ODI - Sakshi

IND VS NZ 2nd ODI: భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో వన్డే తర్వాత ఐసీసీ టీమ్‌ వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా చేతిలో ఓటమి అనంతరం న్యూజిలాండ్‌ వన్డేల్లో తమ టాప్‌ ర్యాంక్‌ కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ అగ్రస్థానానికి చేరుకోగా టీమిండియా నాలుగు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, భారత్‌ ఖాతాల్లో సమానంగా 113 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. కివీస్‌తో సిరీస్‌ను భారత్‌ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేస్తే సింగిల్‌గా టాప్‌ ర్యాంక్‌కు చేరుకుం‍టుంది.

ఇప్పటికే టీ20ల్లో టాప్‌ ర్యాంక్‌లో ఉన్న భారత్‌.. వన్డేల్లో ఆ స్థానాన్ని చేరుకునేందుకు మరో మ్యాచ్‌ దూరంలో మాత్రమే ఉంది. ఇక టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా (126 రేటింగ్‌ పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్‌.. త్వరలో స్వదేశంలో జరిగే 4 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకోగలిగితే, ఈ విభాగంలోనూ అగ్రపీఠానికి చేరుకుంటుంది. మొత్తంగా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో టీమిండియా టాప్‌ ర్యాంక్‌కు చేరుకునేందుకు మరో 5 మ్యాచ్‌ల దూరంలో (ఓ వన్డే, 4 టెస్ట్‌లు) మాత్రమే ఉంది.  

ఇదిలా ఉంటే, రాయ్‌పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌.. మహ్మద్‌ షమీ (3/18), మహ్మద్‌ సిరాజ్‌ (1/10), శార్దూల్‌ ఠాకూర్‌ (1/26), హార్ధిక్‌ పాండ్యా (2/16), కుల్దీప్‌ యాదవ్‌ (1/29), వాషింగ్టన్‌ సుందర్‌ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్‌ను 108 పరుగులకు ఆలౌట్‌ చేసింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (36), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (22), మిచెల్‌ సాంట్నర్‌ (27) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.

109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (50 బంతుల్లో 51 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో 48వ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (53 బంతుల్లో 40 నాటౌట్‌; 6 ఫోర్లు) భీకర ఫామ్‌ను కొనసాగించాడు. వేగంగా మ్యాచ్‌ ముగించే క్రమంలో విరాట్‌ కోహ్లి (9 బంతుల్లో 11; 2 ఫోర్లు) సాంట్నర్‌ బౌలింగ్‌లో స్టంప్‌ ఔటయ్యాడు. కివీస్‌ బౌలర్లలో హెన్రీ షిప్లే, మిచెల్‌ సాంట్నర్‌లకు తలో వికెట్‌ దక్కింది. నామమాత్రమైన మూడో వన్డే ఇండోర్‌ వేదికగా జనవరి 24న జరుగనుంది. 
 

Advertisement
 
Advertisement