
100 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలుపు
రాణించిన బ్రూక్ హాలిడే, సోఫీ డివైన్
గువాహటి: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ న్యూజిలాండ్ ఆలస్యంగా బోణీ చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన కివీస్ జట్టు శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు సుజీ బేట్స్ (29; 6 సిక్స్‌లు), ప్లిమర్ (4), అమెలియా కెర్ (1) విఫలమవడంతో 38 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు పడ్డాయి.
ఈ దశలో కెప్టెన్ సోఫీ డివైన్ (85 బంతుల్లో 63; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రూక్ హాలిడే (104 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 112 పరుగులు జోడించడంతో కివీస్ కుదురుకుంది. అయితే 29 పరుగుల వ్యవధిలో వీళ్లిద్దరు అవుటయ్యాక న్యూజిలాండ్ మళ్లీ తడబడింది. ఆఖరి ఓవర్లలో మ్యాడీ గ్రీన్ (25; 3 ఫోర్లు), జెస్ కెర్ (0), రోజ్‌మేరీ (2), ఇసాబెల్లా గేజ్ (12) వికెట్లను కోల్పోయింది.
ప్రత్యర్థి బౌలర్లలో రబియా ఖాన్ 3 వికెట్లు పడగొట్టింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు 39.5 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఫాహిమా ఖాతూన్ (34; 2 ఫోర్లు), రబియా ఖాన్ (25; 2 ఫోర్లు) రాణించారు. జెస్ కెర్, లీ తహుహు చెరో 3 వికెట్లు తీయగా, రోజ్‌మేరీకి 2 వికెట్లు దక్కాయి. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుతో శ్రీలంక తలపడుతుంది.