అసలు ఆటగాళ్లతో పాటు...

Net Bowlers Also Moving With IPL Franchise - Sakshi

నెట్‌ బౌలర్లను తీసుకెళ్లనున్న ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ లేదా ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా స్థానిక యువ బౌలర్లు నెట్స్‌లో వివిధ జట్లకు సహకరించటం పరిపాటి. జట్టు ప్రధాన బౌలర్లపై భారం తగ్గించడంతో పాటు విభిన్న శైలి బౌలర్లను ఎదుర్కొంటే బ్యాట్స్‌మెన్‌కు అది మేలు చేస్తుందనే నమ్మకమే అందుకు కారణం. సాధారణంగా ఐపీఎల్‌ సమయంలో ఆయా వేదికల్లో పెద్ద సంఖ్యలో నెట్‌ బౌలర్లు స్టార్‌ క్రికెటర్లకు బౌలింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే ఇప్పుడు లీగ్‌ స్వదేశంలో కాకుండా యూఏఈలో జరుగుతోంది. అక్కడ కూడా జట్టు కోరితే స్థానికంగా బౌలర్లు అందుబాటులో ఉండవచ్చు. అయితే తాజా కోవిడ్‌–19 పరిస్థితుల్లో ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా రిస్క్‌ తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. అందుకే టీమ్‌తో పాటు ఇక్కడినుంచే నెట్‌ బౌలర్లను కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. వీరంతా ‘బయో బబుల్‌’లో తమతో భాగంగా ఉండాలని, బయటి వ్యక్తులు ఎవరూ రావాల్సిన అవసరం ఉండరాదని కోరుకుంటున్నాయి.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ పది మంది ఆటగాళ్లను ఇందు కోసం తమ జట్టుతో పాటు యూఏఈకి ప్రత్యేకంగా తీసుకెళ్లనున్నట్లు వెల్లడించింది. వీరంతా తమ జట్టుతో పాటే ఉంటారని చెన్నై టీమ్‌ సీఈఓ కాశీ విశ్వనాథన్‌ చెప్పారు. ఇదే తరహాలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కూడా పది మందిని తీసుకెళ్లనున్నట్లు చెప్పింది. కేకేఆర్‌ అకాడమీ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ వీరిని ఎంపిక చేస్తారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా ఆరుగురు బౌలర్లను తమ టీమ్‌తో పాటు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. యూఏఈకి వెళ్లే ఐపీఎల్‌ ఫ్రాంచైజీ బృందంలో సభ్యుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేకపోవడంతో వారు ఈ తరహా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కలిగింది. సాధారణంగా రంజీ ట్రోఫీ లేదా సీనియర్‌ స్థాయిలో దేశవాళీ టోర్నీ ఆడిన, అండర్‌–23, అండర్‌–19 బౌలర్లు నెట్‌ బౌలర్లుగా వ్యవహరించే అవకాశం ఉంది. మరో వైపు యూఏఈ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటం, తీవ్ర వేడిమి కారణంగా పొడిబారిన పిచ్‌లపై వారు  ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రతీ జట్టు నెట్‌ బౌలర్ల బృందంలో ఎక్కువ మంది స్పిన్నర్లు ఉండే అవకాశం ఉంది.   

ఆగస్టు 20 నుంచి... 
ఐపీఎల్‌ జట్లు ప్రత్యేక విమానాల్లో యూఏఈకి  వెళ్లే తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. అందరికంటే ముందుగా ఈ నెల 20న రాజస్తాన్‌ రాయల్స్‌ బయల్దేరుతుంది. ఆగస్టు 21న డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్, ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ వెళతాయి. తర్వాతి రోజు పంజాబ్, ఢిల్లీ జట్లు వెళ్లే అవకాశం ఉంది. ముంబై జట్టులోని కొందరు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది గత వారం రోజులుగా క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటూ కోవిడ్‌ పరీక్షలకు కూడా హాజరయ్యారు. ధోనిసేన మాత్రం యూఏఈ బయల్దేరడానికి ముందు 15 మందితో చెన్నైలో స్వల్పకాలిక (ఆగస్టు 16 నుంచి 20 వరకు) శిబిరంలో పాల్గొంటుంది. కోహ్లి నేతృత్వంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఈ నెల చివరి వారంలో యూఏఈ వెళుతుంది. ఆగస్టు 23 వరకు ఈ జట్టుకు చెందిన భారత ఆటగాళ్లంతా వారం రోజుల పాటు  క్వారంటైన్‌లో గడుపుతారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాత్రం ఇంకా తమ ప్రయాణ తేదీలు, ఇతర ఏర్పాట్లను ఇంకా ఖరారు చేసుకోలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top