నీరజ్‌ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Neeraj Chopra Hospitalised And Suffering From High Fever - Sakshi

చండీగఢ్‌: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా స్వగ్రామం హరియాణలోని పానిపట్‌ సమీపంలోని సమల్ఖాకు బయల్దేరాడు. ఢిల్లీ నుంచి పానిపట్‌ వరకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరగా స్వగ్రామం చేరుకునేలోపు నీరజ్‌ అస్వస్థతకు గురయ్యాడు. ఉదయం నుంచి కారు టాప్‌పై ఉండి అందరికీ అభివాదం చేస్తూ స్వర్ణ పతకం చూపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నాడు. ఆరు గంటల పాటు సాగిన ఈ యాత్రలో నీరజ్‌ నీరసించిపోయాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కొన్నిరోజులుగా నీరజ్‌ జ్వరంతో బాధపడుతున్నాడు. ఇటీవల హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ఈ కారణంగానే నీరజ్‌ గైర్హాజరయ్యాడు. అయితే ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మాత్రం నీరజ్‌ పాల్గొన్నాడు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి మోదీని కలిసి అభినందనలు పొందాడు. (చదవండి: స్వర్ణ విజేత నీరజ్‌ చోప్రాకు తీవ్ర జ్వరం)

ఒలింపిక్స్‌ తర్వాత తొలిసారి స్వగ్రామం సమల్ఖాకు మంగళవారం వెళ్లిన నీరజ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామస్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నీరజ్‌పై పూల వర్షం కురిపించారు. పిండిపదార్థాలు ప్రత్యేకంగా తయారుచేశారు. పానిపట్‌కు చేరుకున్న అనంతరం నీరజ్‌ నీరసించడంతో వెంటనే అతడి స్నేహితులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నీరజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని స్నేహితుడు ఒకరు తెలిపారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్‌ అని తేలిన విషయం తెలిసిందే. స్వర్ణ పతకం సాధించి వచ్చిన అనంతరం నీరజ్‌ చాలా బిజీ అయ్యాడు. వరుస కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండడంతో అనారోగ్యం చెందాడు. కొంత విశ్రాంతి ఇస్తే ఈ 23 ఏళ్ల యువకుడు కొంత కోలుకునే అవకాశం ఉంది.

చదవండి: ‘ట్విటర్‌ పక్షి’ని మాంచిగా వండి లాగించేసిన కాంగ్రెస్‌ నాయకులు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top