
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను భారత సైన్యం ప్రధానం చేసింది . ఈ మేరకు బుధవారం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. నీరజ్ కొత్త ర్యాంక్ ఏప్రిల్ 16, 2025 నుండి అమల్లోకి వచ్చింది.
"1948 టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులేషన్స్‌లోని పేరా 31 ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ ర్యాంకును ప్రధానం చేయడానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని" రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా నీరజ్ ముందుగా 2016 నయీబ్ సుబేదార్ హోదాలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా భారత సైన్యంలో చేరాడు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్-2021లో గోల్డ్ మెడల్ సాధించడంతో సుబేదార్‌గా పదోన్నతి పొందాడు. కాగా నీరజ్ చోప్రా..ఇండియన్ అథ్లెటిక్స్ హిస్టరీలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని తీసుకొచ్చిన నీరజ్.. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకంతో సత్తాచాటాడు.
ఈ క్రమంలోనే గోల్డెన్ బాయ్‌కు లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. కాగా దేశానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ ప్రత్యేక హోదా భారత సైన్యం సత్కరిస్తోంది. ఈ గౌరవ హోదా పొందిన ఆరో క్రీడాకారుడిగా నీరజ్ నిలిచాడు. నీరజ్ కంటే ముందు ప్రముఖ షూటర్లు అభినవ్ బింద్రా, విజయ్ కుమార్.. దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని ఈ అరుదైన గౌరవాన్ని పొందారు.