భారత క్రికెట్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్యేక స్ధానం ఉంది. 37 ఏళ్ల జడేజా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ తనదైన ముద్రవేసుకున్నాడు. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన ఈ సౌరాష్ట్ర వెటరన్ క్రికెటర్.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో మాత్రం ఆడుతున్నాడు.
అతడి వయస్సు దృష్ట్యా త్వరలోనే టెస్ట్ క్రికెట్‌కూ వీడ్కోలు పలికే అవకాశముంది. దీంతో టీమిండియాలో జడేజా వారసుడు ఎవరన్న చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో ఓ యువ స్పిన్నర్ వెలుగులోకి వచ్చాడు. తన స్పిన్ మాయాజాలంతో జడేజాను తలపిస్తున్నాడు. అతడే రాజస్తాన్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్.
అరంగేట్రంలో అదుర్స్
ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో అరంగేట్రం చేసిన 23 ఏళ్ల మానవ్ సుతార్.. తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్‌లో 28 పరుగులతో రాణించిన సుతార్.. ఆ తర్వాత బౌలింగ్‌తో అఫ్గాన్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.
తన వేసిన తొలి ఓవర్‌లోనే మొదటి అంతర్జాతీయ వికెట్‌ను అతడు పడగొట్టాడు. ఈ రాజస్తాన్ యువ ఆటగాడు పిచ్‌పై బంతిని బాగా టర్న్ చేయడంతో పాటు స్టంప్స్‌ను టార్గెట్ చేస్తూ తనలోని బౌలింగ్ స్కిల్స్‌ను చూపించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లు బౌలింగ్ చేసిన సుతార్.. కేవలం 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
సరికొత్త చరిత్ర
దీంతో మానవ్ సుతార్ ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 21వ శతాబ్దంలో అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన రెండో భారత ప్లేయర్‌గా సుతార్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2008లో అమిత్ మిశ్రా తన అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లో 5 వికెట్ల హాల్ సాధించాడు.
మళ్లీ ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత సుతార్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అదేవిధంగా గత 38 ఏళ్లలో టెస్టు అరంగేట్రంలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా సుతార్ నిలిచాడు. ఇంతకముందు భారత దిగ్గజ బౌలర్ నరేంద్ర హిర్వాణీ తన అరంగేట్రం(1988)లో వెస్టిండీస్‌పై 61 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టారు.
సుతార్ సక్సెస్ వెనక ద్రవిడ్
మానవ్ సుతార్ సక్సెస్ వెనక టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. ఇండియా-A, అండర్-19 జట్లకు ఆడే సమయంలో ద్రవిడ్ దృష్టిలో సుతార్ పడ్డాడు. నువ్వు బ్యాటింగ్‌ను ఎలాగైనా మేనేజ్ చేయగలవు, కానీ నీ బౌలింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టు అని ప్రతీసారి ద్రవిడ్ సలహా ఇచ్చేవాడంట.
ఈ విషయాన్ని మానవ్ కోచ్ ధీరజ్ స్వయంగా తెలిపారు. కాగా ఆ సమయంలో ద్రవిడ్ బెంగళూరులోని ఎన్సీఎ హెడ్‌గా ఉన్నాడు. ప్రస్తుతం తరం క్రికెటర్లంతా వైట్‌బాల్ క్రికెట్ వైపు మొగ్గు చూపుతుంటే, మానవ్ మాత్రం అందుకు భిన్నంగా గత ఐదు, ఆరేళ్ల నుంచి రెడ్‌బాల్ క్రికెట్‌పైనే పూర్తి దృష్టి పెట్టాడు.
ఇప్పటికే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తన సత్తాను నిరూపించుకున్నాడు. తన అరంగేట్ర సీజన్(2022-23 రంజీ ట్రోఫీ) రాజస్థాన్ తరఫున కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 39 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్-2024 నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టులో అతడు భాగంగా ఉన్నాడు.
నెట్స్‌లో టీమిండియా కెప్టెన్, గుజరాత్ టైటాన్స్ సారధి శుబ్‌మన్ గిల్‌కు సుతార్ గంటల తరబడి బౌలింగ్ చేసేవాడు. గిల్ కూడా నెట్స్‌లో సుతార్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికే ఎక్కువ ఆసక్తి చూపించేవాడంట. దగ్గనుంచి అతడి స్కిల్స్‌ను చూసిన గిల్.. సుత్తార్ భారత జట్టుకు ఎంపిక కావడంలో తన వంతు పాత్ర పోషించాడు.


