పాకిస్తాన్‌తో తొలి వన్డేలో ఎదురైన ఓటమికి ఆస్ట్రేలియా బదులు తీర్చుకుంది. మంగళవారం లహోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య పాక్‌ను 41 పరుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో కంగారులు సమం చేశారు. లహోర్ వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు పాక్ స్పిన్నర్లు అరాఫత్ మిన్హాస్, అబ్రార్ అహ్మద్‌లు ఊహించని షాకిచ్చారు.
వారి ధాటికి పర్యాటక జట్టు కేవలం 51 పరుగులకే మూడు కీలక వికెట్లు (అలెక్స్ క్యారీ 0, మాట్ షార్ట్ 15, మార్నస్ లబుషేన్ 5) కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ జోష్ ఇంగ్లిష్, కామెరూన్ గ్రీన్(53) అద్భుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇంగ్లిష్(74 బంతుల్లో 5 ఫోర్లతో 51 పరుగులు) హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత అరాఫత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంగ్లిస్ ఔటైన తర్వాత గ్రీన్ కూడా పెవిలియన్‌కు చేరాడు.
అనంతరం రెన్‌షా (43 బంతుల్లో 43, మూడు ఫోర్లు), ఆలివర్ పీక్ (32 బంతుల్లో 31, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) కూడా తమ బ్యాట్‌కు పనిచెప్పారు. దీంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది మూడు, హారిస్ రవూఫ్, మిన్హాస్, అబ్రార్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.
నిప్పులు చెరిగిన ఎల్లిస్
అనంతరం 232 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఆస్ట్రేలియా బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా పేసర్ నాథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మాథ్యూ షార్ట్ కూడా 3 వికెట్లతో సత్తాచాటాడు. ఫలితంగా పాకిస్తాన్ 44 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో షాదాబ్ ఖాన్(71) ఒంటరి పోరాటం చేసినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ లహోర్ వేదికగా జూన్ 4న జరగనుంది.


