ఆసీస్‌ కొంపముంచిన పాక్ సంచలనం.. 4 దశాబ్దాల రికార్డు బద్దలు | Pakistans Arafat Minhas Breaks 4 Decade Old Record | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ కొంపముంచిన పాక్ సంచలనం.. 4 దశాబ్దాల రికార్డు బద్దలు

May 30 2026 9:29 PM | Updated on May 30 2026 9:29 PM

Pakistans Arafat Minhas Breaks 4 Decade Old Record

పాకిస్తాన్ క్రికెట్‌కు మ‌రో అద్భుత‌మైన ఆల్‌రౌండ‌ర్ దొరికాడు. అరంగేట్రంలో త‌న స్పిన్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా వంటి ప‌టిష్ట‌మైన జ‌ట్టుకే చుక్క‌లు చూపించాడు. ఆ యువ స్పిన్నర్‌ను జోష్ ఇంగ్లిష్‌, మార్నస్ లబుషేన్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం ఎదుర్కోలేకపోయారు. అత‌డే 21 ఏళ్ల అరాఫత్ మిన్హాస్. శ‌నివారం రావ‌ల్పిండి వేదిక‌గా ఆసీస్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డేతో మిన్హాస్ అరంగేట్రం చేశాడు.

మిన్హాస్ మూడేళ్ల కింద‌టే  టీ20ల్లో డెబ్యూ చేసిన‌ప్ప‌టికి పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌ల కార‌ణంగా జ‌ట్టులో చోటు కోల్పోయాడు. కానీ ఇటీవ‌ల డొమాస్టిక్ క్రికెట్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో పాక్ సెలెక్ట‌ర్ల నుంచి మ‌ళ్లీ అత‌డికి పిలుపు వ‌చ్చింది. ఈసారి మాత్రం సెలెక్ట‌ర్ల న‌మ్మకాన్ని అరాఫ‌త్ నిలబెట్టుకున్నాడు.

త‌న మొద‌టి  వ‌న్డేలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 32 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన పాకిస్తాన్‌ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు 1984లో జకీర్‌ ఖాన్‌ తన వన్డే డెబ్యూలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో 42 ఏళ్ల రికార్డును అరాఫత్ బ్రేక్‌ చేశాడు.

అతడి బౌలింగ్ ధాటికి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది.  ఆసీస్‌ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్‌(55), మాట్‌ రెన్‌షా(61) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. పాక్‌ బౌలర్లలో అరాఫత్‌తో పాటు షాహీన్‌ షా అఫ్రిది, రౌఫ్‌, అఘా ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement