ఆస్ట్రేలియాను చిత్తు చేసిన పాకిస్తాన్‌ | Pakistan Thrash Australia By 5 Wickets In 1st ODI, Arafat Minhas Stars On Debut | Sakshi
Sakshi News home page

PAK vs AUS: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన పాకిస్తాన్‌

May 31 2026 4:50 PM | Updated on May 31 2026 6:15 PM

Arafat Minhas five-fer on debut sets up Pakistans easy win

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్‌ శుభారంభం చేసింది. శనివారం రావాల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ను 5 వికెట్ల తేడాతో పాక్‌ చిత్తు చేసింది. తమ 1,000 వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. పాక్‌ బౌలర్ల ధాటికి 44.1 ఓవర్లలో 200 పరుగులకే కుప్పకూలింది. అరంగేట్ర ఆటగాడు అరాఫత్ మిన్హాస్ 5 వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించాడు. జోష్‌ ఇంగ్లిష్‌, గ్రీన్‌, లబుషేన్‌ వంటి కీలక వికెట్లను అరాఫత్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

తద్వారా వన్డే అరంగేట్రంలో 5 వికెట్లు పడగొట్టిన తొలి పాక్‌ బౌలర్‌గా మిన్హాస్‌ నిలిచాడు. ఇక ఆసీస్‌ బ్యాటర్లలో మాట్ రెన్‌షా(61), మాథ్యూ షార్ట్(55) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పాక్‌ బౌలర్లలో మిన్హాస్‌తో పాటు అబ్రార్‌ రెండు, రౌఫ్‌, అఫ్రిది, అఘా తలా వికెట్‌ సాధించారు.

బాబర్‌, ఘోరి హాఫ్‌ సెంచరీలు
అనంతరం  పాకిస్తాన్ 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే స్టార్‌ బ్యాటర్‌  బాబర్ ఆజం (69), వికెట్ కీపర్ బ్యాటర్ ఘాజీ ఘోరి (65) మూడో వికెట్‌కు 127 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ ఔటైనప్పటికి మిన్హాస్‌(18), సమద్‌(1) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు.

ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ ఈల్లీస్‌ రెండు, మాథ్యూ కునెమన్, తన్వీర్‌ సంగా, లబుషేన్‌ తలా వికెట్‌ సాధించారు.  ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూన్‌ 2న లహోర్‌ వేదికగా జరగనుంది.
చదవండి: గర్వంగానే ఉంది.. నన్ను ఇరకాటంలో పెట్టొద్దు: అగార్కర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement