హార్దిక్‌ స్పెషల్‌ ఇన్నింగ్స్‌కు ముంబై విషెస్‌

Mumbai Indians Recall Hardik Pandyas Maiden Test Hundred - Sakshi

ముంబై: ఇటీవల తండ్రిగా ప్రమోషన్‌ పొందిన టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. ఐపీఎల్‌-13వ సీజన్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సుదీర్ఘ కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న హార్దిక్‌.. మళ్లీ బరిలోకి దిగి పూర్వపు ఫామ్‌ను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్‌.. క్రికెట్‌ బరిలోకి దిగి చాలాకాలమే అయ్యింది. వెన్నుగాయానికి శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకున్న తర్వాత దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపి పునరాగమనం ఖాయమనుకున్న తరుణంలో కోవిడ్‌-19 కారణంగా మొత్తం టోర్నీలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. (10 నిమిషాలు మైండ్‌ బ్లాక్‌: కుల్దీప్‌)

వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్‌ జరుగనుంది. దీనికి అన్ని జట్లు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉంచితే, సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు హార్దిక్‌ పాండ్యా తొలి టెస్టు సెంచరీని సాధించాడు. 2017లో శ్రీలంకతో మూడో టెస్టులో పాండ్యా శతకం బాదేశాడు. 87 బంతుల్లో సెంచరీ సాధించి తన టెస్టు కెరీర్‌లో మొదటి శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత పాండ్యా ఖాతాలో టెస్టు సెంచరీ చేరలేదు. అయితే పాండ్యా తొలి టెస్టు సెంచరీపై ముంబై ఇండియన్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఒక ఫోటోను షేర్‌ చేసింది. అప్పుడు ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌ అవార్డును గెలుచుకున్న హార్దిక్‌ ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘ మొదటి సెంచరీ అనేది ఎప్పుడూ ప్రత్యేకమే’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. 

2018లో వెన్నుగాయం బారిన పడిన హార్దిక్‌.. గతేడాది దానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. తన రీఎంట్రీ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో భాగంగా దేశవాళీ మ్యాచ్‌ల్లో చెలరేగిపోయిన హార్దిక్‌..  ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగి సత్తాచాటాలనుకుంటున్నాడు.  కాగా, టెస్టు ఫార్మాట్‌ ఆడాలా.. లేక పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలా అనే డైలమాలో ఉన్నాడు హార్దిక్‌. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలక ఆటగాడైన హార్దిక్‌కు టెస్టు క్రికెట్‌ను వదిలేయాలనే ఉద్దేశం కూడా కనబడుతోంది. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టి సారిస్తానని పాండ్యా తెలిపాడు. తనకున్న ప్రధాన బలం ఎనర్జీనేనని, అన్ని ఫార్మాట్లు ఆడితే తన ఆటను బ్యాలెన్స్‌ చేసుకోవడం కష్టమవుతుందని పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top