రైజర్స్‌ ఓటమి బాట | Mumbai beat Sunrisers Hyderabad by 4 wickets | Sakshi
Sakshi News home page

రైజర్స్‌ ఓటమి బాట

Apr 18 2025 12:53 AM | Updated on Apr 18 2025 11:35 AM

Mumbai beat Sunrisers Hyderabad by 4 wickets

4 వికెట్లతో ముంబై ఇండియన్స్‌ విజయం 

విల్‌ జాక్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన   

ఐదు రోజుల క్రితం అద్భుత ఆటతో 245 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పుడు సమష్టి వైఫల్యంతో మరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నాలుగు వరుస ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఖాతాలో మళ్లీ ఓటమి చేరింది. బ్యాటింగ్‌లో మెరుపులు కనిపించక టీమ్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత ఛేదనలో ముంబై ఇండియన్స్‌ కొంత తడబడినా... మరో 11 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకోవడంలో సఫలమైంది. 

ముంబై: ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన పోరులో ముంబై 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 

అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (28 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ద మ్యాచ్‌’ విల్‌ జాక్స్‌ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ర్యాన్‌ రికెల్టన్‌ (23 బంతుల్లో 31; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు.  

కనిపించని దూకుడు... 
ఇన్నింగ్స్‌ తొలి బంతికే అభిషేక్‌కు అదృష్టం కలిసొచ్చింది. దీపక్‌ చహర్‌ వేసిన బంతి అభిక్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను తీసుకొని స్లిప్‌ వైపు దూసుకెళ్లగా విల్‌ జాక్స్‌ దానిని అందుకోలేకపోయాడు. అనంతరం అతను కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. మరోవైపు ట్రవిస్‌ హెడ్‌ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) బ్యాటింగ్‌లో సహజమైన ధాటి కనిపించలేదు. చహర్‌ ఓవర్లో అభిషేక్‌ వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 46 పరుగులకు చేరింది. 

ఆ తర్వాత ఒక్కసారిగా ముంబై బౌలర్ల ఆధిపత్యం మొదలైంది. కట్టుదిట్టమైన బంతులతో వారు రైజర్స్‌ను నిలువరించారు. తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం (45 బంతుల్లో) తర్వాత అభిషేక్‌ను పాండ్యా వెనక్కి పంపాడు. 24 పరుగుల వద్ద క్యాచ్‌ ఇచ్చినా... నోబాల్‌తో బతికిపోయిన హెడ్‌ దానిని వాడుకోలేకపోయాడు. ఇషాన్‌ కిషన్‌ (2) మళ్లీ విఫలం కాగా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి (21 బంతుల్లో 19; 1 ఫోర్‌) మరోసారి ప్రభావం చూపలేకపోయాడు. 

పవర్‌ప్లే ముగిసిన తర్వాత 7–17 ఓవర్ల మధ్యలో రైజర్స్‌ 5 ఫోర్లు మాత్రమే కొట్టగా... ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్‌ వరకు ఒక్క సిక్స్‌ కూడా రాలేదు. చివర్లో 2 ఓవర్ల కారణంగా (మొత్తం 43 పరుగులు) రైజర్స్‌ స్కోరు 160 దాటింది. చహర్‌ వేసిన 18వ ఓవర్లో క్లాసెన్‌ వరుసగా 6, 4, 4, 6 బాదగా... పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో అనికేత్‌ 2 సిక్స్‌లు, కమిన్స్‌ ఒక సిక్స్‌ కొట్టారు.  

కీలక భాగస్వామ్యం.. 
ఎప్పటిలాగే ఫటాఫట్‌ షాట్లతో ఛేదనను మొదలు పెట్టిన రోహిత్‌ శర్మ (16 బంతుల్లో 26; 3 సిక్స్‌లు) మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు సిక్సర్లు బాదాడు. మలింగ ఓవర్లో రికెల్టన్‌ మూడు ఫోర్లు కొట్టగా, 4 పరుగుల వద్ద జాక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను హెడ్‌ వదిలేశాడు. 

రికెల్టెన్‌ అవుటైన తర్వాత జాక్స్, సూర్యకుమార్‌ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 29 బంతుల్లో 52 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. వీరిద్దరు ఏడు పరుగుల తేడాతో వెనుదిరిగినా... కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా (9 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్‌), తిలక్‌ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్‌; 2 ఫోర్లు) కలిసి గెలుపు దిశగా నడిపించారు.  

స్కోరు వివరాలు  
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి) (సబ్‌) బావా (బి) పాండ్యా 40; హెడ్‌ (సి) సాంట్నర్‌ (బి) జాక్స్‌ 28; ఇషాన్‌ కిషన్‌ (స్టంప్డ్‌) రికెల్టన్‌ (బి) జాక్స్‌ 2; నితీశ్‌ కుమార్‌ రెడ్డి (సి) తిలక్‌ వర్మ (బి) బౌల్ట్‌ 19; క్లాసెన్‌ (బి) బుమ్రా 37; అనికేత్‌ వర్మ (నాటౌట్‌) 18; కమిన్స్‌ (నాటౌట్‌) 18; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–59, 2–68, 3–82, 4–113, 5–136. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–47–0, బౌల్ట్‌ 4–0–29–1, బుమ్రా 4–0–21–1, విల్‌ జాక్స్‌ 3–0–14–2, హార్దిక్‌ పాండ్యా 4–0–42–1, సాంట్నర్‌ 1–0–8–0.  

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) హెడ్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 31; రోహిత్‌ (సి) హెడ్‌ (బి) కమిన్స్‌ 26; విల్‌ జాక్స్‌ (సి) అన్సారీ (బి) కమిన్స్‌ 36; సూర్యకుమార్‌ (సి) అన్సారీ (బి) కమిన్స్‌ 26; తిలక్‌ వర్మ (నాటౌట్‌) 21; పాండ్యా (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) మలింగ 21; నమన్‌ (ఎల్బీ) (బి) మలింగ 0; సాంట్నర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 6 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–32, 2–69, 3–121, 4–128, 5–162, 6–162. బౌలింగ్‌: షమీ 3–0–28–0, కమిన్స్‌ 4–0–26–3, ఇషాన్‌ మలింగ 4–0–36–2, అన్సారీ 3.1–0–35–0, హర్షల్‌ 3–0–31–1, రాహుల్‌ చహర్‌ 1–0–9–0.  

ఐపీఎల్‌లో నేడు
బెంగళూరు X పంజాబ్‌  
వేదిక: బెంగళూరు
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement