చరిత్ర సృష్టించిన ఆఫ్గాన్‌ ఆటగాడు.. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ! | Sakshi
Sakshi News home page

PAK vs AFG: చరిత్ర సృష్టించిన ఆఫ్గాన్‌ ఆటగాడు.. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ! 40 ఏళ్ల రికార్డు బద్దలు

Published Sun, Aug 27 2023 12:28 PM

Mujeeb Ur Rahman hits fastest ODI fifty for Afghanistan - Sakshi

ఆఫ్గానిస్తాన్‌ ఆటగాడు, స్టార్‌ స్పిన్నర్‌ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా హాఫ్‌సెంచరీ చేసిన తొలి ఆఫ్గాన్‌ క్రికెటర్‌గా ముజీబ్‌ రికార్డులకెక్కాడు. కొలాంబో వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో 26 బంతుల్లో  హాఫ్‌ సెంచరీ చేసిన ముజీబ్‌.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో 269 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్గానిస్తాన్‌ కేవలం 97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో 9వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ముజీబ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. పాక్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 37 బంతులు ఎదుర్కొన్న ముజీబ్‌ 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అదే విధంగా మరోరికార్డును కూడా ముజీబ్‌ తన పేరిట లిఖించుకున్నాడు.

వన్డేల్లొ పాకిస్తాన్‌పై తొమ్మిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ముజీబ్‌ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో శ్రీలంక వికెట్‌ కీపర్‌- బ్యాటర్‌ అటెర్ గై డి అల్విస్ రికార్డును ముజీబ్‌ బ్రేక్‌ చేశాడు. 1983 ప్రపంచ కప్‌లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్‌పై 56 బంతుల్లో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

తాజా మ్యాచ్‌లో 64 పరుగులు చేసిన ముజీబ్‌.. 40 ఏళ్ల  అల్విస్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముజీబ్‌ దురదృష్టవశాత్తూ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. తద్వారా వన్డేల్లో హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆఫ్గాన్‌ క్రికెటర్‌గా చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్‌ క్రికెటర్‌

Advertisement
Advertisement