
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ (Mithun Manhas) నియమితుడయ్యాడు. ముంబైలో ఆదివారం జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో కొత్త బాస్‌కు సంబంధించిన నిర్ణయం జరిగింది. 45 ఏళ్ల మిథున్ మన్హాస్ పోటీ అన్నదే లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
దేశీ క్రికెట్‌లో పరుగుల వరద
కాగా జమ్మూ కశ్మీర్‌కు చెందిన మిథున్ మన్హాస్ ఢిల్లీ తరఫున సుదీర్ధకాలం దేశవాళీ క్రికెట్ ఆడాడు. 1997- 2017 వరకు కొనసాగిన కెరీర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 157 మ్యాచ్‌లు ఆడిన మిథున్.. 27 శతకాల సాయంతో 9714 పరుగులు సాధించాడు. అదే విధంగా.. లిస్ట్-‘ఎ’ క్రికెట్‌లో 130 మ్యాచ్‌లలో కలిపి 4126 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండటం విశేషం.
ఇక టీ20 ఫార్మాట్లో 91 మ్యాచ్‌లు ఆడిన మన్హాస్ 1170 పరుగులు చేశాడు. అయితే, మిడిలార్డర్ బ్యాటర్ అయిన మన్హాస్‌కు.. తన కెరీర్‌లో ఎప్పుడూ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం రాలేదు. టీమిండియా తరఫున అరంగేట్రం చేయకుండానే మన్హాస్ ఆటకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది.
ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డేర్‌డెవిల్స్), పుణె వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడిన మిథున్ మన్హాస్.. మొత్తంగా 55 మ్యాచ్‌లు ఆడి 514 పరుగులు రాబట్టాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా మారిన మన్హాస్.. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పంజాబ్ కింగ్‌స, గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ జట్ల సహాయక బృందంతో కీలక పాత్ర పోషించాడు.
కోచ్‌గానూ సేవలు
అంతేకాదు బంగ్లాదేశ్ పురుషుల అండర్-19 జట్టుకు బ్యాటింగ్ సలహాదారుడిగానూ మిథున్ మన్హాస్ పనిచేశాడు. ఇక జమ్మూ కశ్మీర్ క్రికెట్‌ను గాడిన పెట్టే క్రమంలో బీసీసీఐ నియమించిన కమిటిలో ఉన్న మిథున్‌కు క్రీడా పరిపాలనలోనూ అనుభవం ఉంది.
అనూహ్యంగా తెరపైకి
అయితే, ఊహించని రీతిలో మిథున్ మన్హాస్ ఏకంగా బీసీసీఐ అధ్యక్షుడిగా.. అది కూడా పోటీలేకుండా ఏకగ్రీవం కావడం విశేషం.బోర్డు పెద్దల అండదండలతోనే అతడికి పదవి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా 70 ఏళ్ల వయసు నిండిన కారణంగా రోజర్ బిన్నీ.. బోర్డు నిబంధనల ప్రకారం ఇటీవలే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో బిన్నీ స్థానంలో ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. తాజాగా మన్హాస్ ఎంపిక అధికారికం కావడంతో.. బిన్నీ వారసుడిగా అతడు బాధ్యతలు చేపట్టనున్నాడు.
సరికొత్త చరిత్ర
తద్వారా సౌరవ్ గంగూలీ, బిన్నీ తర్వాత బీసీసీఐ బాస్ అయిన మూడో క్రికెటర్‌గా.. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆడకుండానే ఈ పదవిని అలంకరించిన తొలి ఆటగాడిగా మన్హాస్ చరిత్ర సృష్టించాడు.
చదవండి: ఆసియా కప్ ఫైనల్: బలహీనంగానే పాకిస్తాన్.. భయపెడుతున్న ముఖాముఖి రికార్డు!