
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం: భారత మహిళా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను సముచిత రీతిలో గౌరవించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సిద్ధమైంది. నగరంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఒక స్టాండ్‌కు మిథాలీ రాజ్ పేరు పెట్టనున్నారు. ఈ నెల 12న ఈ స్టేడియంలో భారత్, ఆ్రస్టేలియా మధ్య జరిగే ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా అధికారికంగా ఈ స్టాండ్‌ను ఆవిష్కరిస్తారు. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మిథాలీ 333 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది.
232 వన్డేల్లో 7805 పరుగులు చేసిన మిథాలీ... ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతోంది. వీటిలో 155 మ్యాచ్‌లకు ఆమె కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. మిథాలీ మరో 12 టెస్టులు, 89 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు కూడా ఆడింది. భారత క్రికెట్‌లో ఒక మహిళా క్రీడాకారిణి పేరుతో స్టాండ్ ఉండటం ఇదే మొదటిసారి కానుంది. 2022లో రిటైర్ అయిన 43 ఏళ్ల మిథాలీ ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా కొనసాగుతోంది.
రావి కల్పన పేరుతోనూ...
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ క్రికెటర్ రావి కల్పన పేరు కూడా ఇదే మైదానంలో మరో స్టాండ్‌కు పెట్టనున్నారు. వికెట్ కీపర్ అయిన కల్పన 2015–16 మధ్య భారత్ తరఫున 7 వన్డేలు ఆడింది. 29 ఏళ్ల కల్పన క్రికెట్ గణాంకాలు అసాధారణంగా లేకపోయినా ... అతి సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఆమె ఎదిగిన తీరు పలువురు మహిళా వర్ధమాన క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచింది. దీనినే దృష్టిలో ఉంచుకొని ఆమె పేరుతో కూడా స్టాండ్ ఏర్పాటు చేస్తున్నారు. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కల్పన దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్ర, రైల్వేస్ జట్లకు ప్రాతినిధ్యం వహించింది.
వైజాగ్‌లో భారత జట్టు ఈనెల 9న దక్షిణాఫ్రికాతో, 12న ఆ్రస్టేలియాతో విశాఖపట్నంలో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం భారత జట్టు సోమవారం కొలంబో నుంచి వైజాగ్‌కు చేరుకుంది. కొలంబోలో ఆదివారం పాకిస్తాన్ జట్టుతో ఆడిన భారత జట్టు 88 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.