అంపైర్‌ను తిట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు

mitchell marsh fined 5000 dollars for his angry reaction over umpire decision - Sakshi

సాక్షి, సిడ్నీ: మైదానంలో క్రికెటర్లు ఆవేశానికి లోనై సహనాన్ని కోల్పోవడం, ఆతరువాత దానికి తగిన మూల్యం చెల్లించుకోవడం తరుచూ గమనిస్తూ ఉంటాం. బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా పెర్త్‌ స్కార్చర్స్‌, సిడ్నీ సిక్సర్స్‌ మధ్య జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే పునరావృతమయ్యింది. పెర్త్‌ స్కార్చర్స్‌  ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ అంపైర్‌ నిర్ణయంపై విస్మయానికి గురై క్షణికావేశంలో పరుష పదాజాలాన్ని వాడి, దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకున్నాడు. 

స్కార్చర్స్‌ ఇన్నింగ్స్‌లో(13 వ ఓవర్‌ 5వ బంతి) సిడ్నీ బౌలర్‌ స్టీవ్‌ ఓ కీఫ్‌ వేసిన బంతి మిచెల్‌ మార్ష్‌ బ్యాట్‌కు తాకి వికెట్‌ కీపర్‌ చేతుల్లోకి వెళ్లిందని భావించిన అంపైర్‌.. మార్ష్‌ను అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన మార్ష్‌.. ఆవేశంలో దురుసుగా ప్రవర్తించి 5000 డాలర్ల జరిమానాను ఎదుర్కొన్నాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌, లెవెల్‌-2 నేరం కింద ఈ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌కు జరిమానా విధిస్తున్నట్టు మ్యాచ్‌ రిఫరీ బాబ్‌ స్ట్రాట్‌ఫోర్డ్‌ వెల్లడించారు. 

కాగా, ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ జట్టు పెర్త్‌ స్కార్చర్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కార్చర్స్‌ 167 పరుగులు సాధించగా, సిడ్నీ జట్టు మరో 18 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు జోష్‌ ఫిలిప్‌(45), జేమ్స్‌ విన్స్‌ (53 బంతుల్లో 98 నాటౌట్‌) అద్భుతంగా ఆడి తమ జట్టుకు విజయాన్నందించారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top