సాక్షి, హైదరాబాద్: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ లీగ్ దశలో మైటీ మరాఠాస్, కాకతీయ నైట్స్ తొలి రెండు స్థానాల్లో నిలిచి ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించాయి. 9వ రౌండ్ మ్యాచ్ల తర్వాత ఈ రెండు టీమ్లు 6 విజయాలు, 3 పరాజయాలతో 12 పాయింట్లు సాధించి సమంగా నిలిచాయి. అయితే ‘పాయింట్ డిఫరెన్స్’ ద్వారా మరాఠాస్ తొలి స్థానంలో నిలిచింది. శుక్రవారం జరిగిన పోటీల్లో మైటీ మరాఠాస్ 6–0 (75–74, 77–75, 76–71)తో చేరో ఆర్చర్స్పై, కాకతీయ నైట్స్ 6–2 (77–74, 76–76, 77–77, 79–75)తో పృథ్వీరాజ్ యోధాస్పై, చోళా చీఫ్స్ 5–3 (77–69, 73–78, 76–74, 76–76)తో రాజ్పుతానా రాయల్స్పై విజయం సాధించాయి.
చోళా చీఫ్స్ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు చేజార్చుకోగా... మిగిలిన రెండు స్థానాల కోసం రాజ్పుతానా, చేరో, యోధాస్ జట్లు పోటీలో నిలిచాయి. ఈ మూడు టీమ్లు ప్రస్తుతం తలా 3 పాయింట్లతో సమంగా ఉండగా, నేడు జరిగే మ్యాచ్ల తర్వాత ఈ స్థానాలు ఖరారవుతాయి. అనంతరం మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే టీమ్ల మధ్యే నేడు ‘ఎలిమినేటర్’ పోరు జరుగుతుంది. ఆదివారం మరాఠాస్, కాకతీయ మధ్య తొలి క్వాలిఫయర్ నిర్వహిస్తారు. ఇక్కడి ఓడిన జట్టు ‘ఎలిమినేటర్’ విజేతతో రెండో క్వాలిఫయర్లో తలపడుతుంది. ఫైనల్ పోరు కూడా ఆదివారమే జరుగుతుంది.


