సాక్షి, హైదరాబాద్: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2లో వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఎట్టకేలకు చోళా చీఫ్స్ విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో చోళా ‘షూటౌట్’లో పృథ్వీరాజ్ యోధాస్‌ను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 4–4 (76–72, 78–77, 73–75, 74–77)తో సమంగా నిలిచాయి. అయితే షూటౌట్లో చీఫ్స్ 2–0తో నెగ్గి పైచేయి సాధించింది. జట్టు ఆర్చర్లు కొండపావులూరి యుక్తశ్రీ, అలెజాండ్రా యుస్క్వినో సరిగ్గా ‘గోల్డెన్ x ’ రింగ్‌లో బాణాలను కొట్టి తమ జట్టును గెలిపించారు.
రెండో మ్యాచ్‌లో రాజ్‌పుతానా రాయల్స్ 6–2 (77–65, 75–66, 73–76, 77–74) స్కోరుతో లీగ్ టాపర్ మైటీ మరాఠాస్‌పై విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో చేరో ఆర్చర్స్ 6–0 (76–73, 77–76, 75–74)తో కాకతీయ నైట్స్‌ను చిత్తు చేసింది. లీగ్ దశలో ప్రతీ జట్టు మరో 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నేడు జరిగే పోరులో రాజ్‌పుతానా రాయల్స్‌తో చోళా చీఫ్స్, కాకతీయ నైట్స్‌తో పృథ్వీరాజ్ యోధాస్, మైటీ మరాఠాస్‌తో చేరో ఆర్చర్స్ తలపడతాయి.


