సాక్షి, హైదరాబాద్: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 పోటీల్లో సోమవారం కాకతీయ నైట్స్, మైటీ మరాఠాస్ కీలక విజయాలను అందుకున్నాయి. ఫామ్‌లో ఉన్న చేరో ఆర్చర్స్‌పై ‘షూటౌట్’లో మైటీ మరాఠాస్ విజయం సాధించింది. రెగ్యులేషన్ టైమ్‌లో ఇరు జట్లు 4–4 (74–76, 76–76, 77–77, 77–76)తో సమంగా నిలిచాయి. టైబ్రేక్‌లో మరాఠాస్ తరఫున ధీరజ్ బొమ్మదేవర, అమన్ సైనీ సత్తా చాటడంతో 2–1తో జట్టు పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది.
రెండో మ్యాచ్‌లో కాకతీయ నైట్స్ 6–2 (77–76, 76–75, 72–76, 77–73) స్కోరుతో పృథ్వీరాజ్ యోధాస్‌ను ఓడించింది. కాకతీయ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ విఫలమైనా... ఆస్ట్రేలియా ఆర్చర్ నికో వీనర్, ఆసియా క్రీడల విజేత నీరజ్ చౌహాన్ కలిసి జట్టును గెలిపించారు. మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాజ్‌పుతానా రాయల్స్ 5–1 (71–63, 74–69, 78–78) తేడాతో చోళా చీఫ్స్‌ను చిత్తు చేసింది.
తొలి రెండు సెట్‌లలో పేలవ ప్రదర్శనతో బాగా వెనుకబడిన చోళా టీమ్... ఆ తర్వాత మూడో సెట్‌లో సబ్‌స్టిట్యూట్‌లు దీపికా కుమారి, మార్కస్ డి అల్మిడా రాకతో కోలుకొని గట్టి పోటీనిచ్చినా ఫలితం లేకపోయింది. సోమవారంతో సగం లీగ్ దశ ముగిసింది. ప్రస్తుతం నాలుగు టీమ్‌లు సమానంగా మూడేసి విజయాలు సాధించగా... 10 పాయింట్ల ‘డిఫరెన్స్’తో చేరో ఆర్చర్స్ అగ్రస్థానంలో, మైటీ మరాఠాస్ (4 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.


