చేరో ఆర్చర్స్‌కు తొలి ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2లో రెండు ఓటముల తర్వాత మైటీ మరాఠాస్ తొలి విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మూడు సెట్‌ల పోరులో మరాఠాస్ 6–0 (74–73, 78–75, 74–72) స్కోరుతో చోళా చీఫ్స్‌ను చిత్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో సెట్‌లో కీలక దశలో ఒత్తిడిని అధిగమించిన ధీరజ్ ‘సూపర్ 10’ నమోదు చేయడంతో మరాఠాస్ పైచేయి సాధించింది.
తెలంగాణ ప్లేయర్ తానిపర్తి చికిత మూడు సార్లు 9/10కే పరిమితం కావడం, మూడో సెట్‌లో దీపికా కుమారి విఫలం కావడం చోళా అవకాశాలను దెబ్బ తీసింది. రెండో మ్యాచ్‌లో పృథ్వీరాజ్ యోధాస్ ‘సడెన్ డెత్’లో చేరో ఆర్చర్స్‌పై విజయం సాధించింది. ఇరు జట్లు రెగ్యులేషన్ టైమ్‌లో 4–4 (75–64, 74–76, 75–76, 74–71)తో సమంగా నిలిచాయి. తొలి టైబ్రేకర్ ‘షూటౌఫ్’లో ఇరు జట్లకు చెందిన నలుగురు ఆర్చర్లు కూడా లక్ష్యానికి చాలా దూరంలో బాణాలు కొట్టడంతో ‘మిసెస్’గా నమోదయ్యాయి. దాంతో మ్యాచ్ ‘సడెన్ డెత్’కు వెళ్లింది.
చేరో ప్లేయర్ ప్రీతిక ప్రదీప్ విఫలం కాగా, యోధాస్ ఆర్చర్ మతియాస్ గ్రాండ్ సరిగ్గా ఇన్నర్ రింగ్‌ను కొట్టడంతో జట్టు గెలుపు ఖాయమైంది. మూడో మ్యాచ్‌లో కాకతీయ నైట్స్ 6–2 (74–75, 75–74, 77–76, 79–74) స్కోరుతో డిఫెండింగ్ చాంపియన్ రాజ్‌పుతానా రాయల్స్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌లలో చేరోతో కాకతీయ, చోళాతో యోధాస్, మరాఠాస్‌తో రాజ్‌పుతానా జట్లు తలపడతాయి.


