కాకతీయ నైట్స్‌ శుభారంభం | Archery Premier League begins at Peoples Plaza | Sakshi
Sakshi News home page

కాకతీయ నైట్స్‌ శుభారంభం

Oct 9 2026 4:22 AM | Updated on Oct 9 2026 4:23 AM

Archery Premier League begins at Peoples Plaza

తొలి మ్యాచ్‌లో మైటీ మరాఠాస్‌పై గెలుపు

ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ను కాకతీయ నైట్స్‌ జట్టు విజయంతో మొదలు పెట్టింది. నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో గురువారం రాత్రి ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో కాకతీయ నైట్స్‌ ‘టైబ్రేకర్‌’లో మైటీ మరాఠాస్‌ను ఓడించింది. ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. తొలి రెండు సెట్‌లను కాకతీయ 73–76, 74–77 తేడాతో ఓడిపోయి 0–4తో వెనుకబడింది. అయితే ఈ దశలో కోలుకున్న జట్టు మూడో సెట్‌లో 75–66తో పైచేయి సాధించింది. 

పైగా రెండు సెట్‌లలో రాణించిన ధీరజ్‌ బొమ్మదేవర స్థానంలో మూడో సెట్‌లో సబ్‌స్టిట్యూట్‌గా మృణాల్‌ చౌహాన్‌ను దించడం మరాఠా జట్టుకు నష్టం కలిగించింది. పైగా నాలుగో సెట్‌లో టీమ్‌ను దురదృష్టం వెంటాడింది. నిర్ణీత 120 సెకన్లలో 8 బాణాలను సంధించలేకపోయిన జట్టు బాగా వెనుకబడిపోగా...76–60తో సెట్‌ నైట్స్‌ సొంతమైంది. దాంతో ఇరు జట్ల మధ్య ‘టైబ్రేకర్‌’ తప్పనిసరిగా మారింది. ఈ దశలో 2–0తో పైచేయి సాధించిన కాకతీయ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాజ్‌పుతానా రాయల్స్‌ 5–3 తేడాతో పృథ్వీరాజ్‌ యోధాస్‌పై విజయం సాధించింది. 

రాయల్స్‌ 75–69 పాయింట్లతో తొలి సెట్‌ను గెలుచుకోగా, రెండో సెట్‌ను 74–73తో యోధాస్‌ సొంతమైంది. హోరాహోరీగా సాగిన మూడో సెట్‌ 77–77తో సమమైంది. ఆ తర్వాత నాలుగో సెట్‌లో 76–75తో పైచేయి సాధించిన రాయల్స్‌ మ్యాచ్‌ను గెలుచుకుంది. గురువారం జరిగిన మూడో మ్యాచ్‌లో చేరో ఆర్చర్స్‌ 5–3తో చోళా చీఫ్స్‌పై గెలుపొందింది. చేరో 74–69, 70–71, 79–75, 73–73తో తాటిపర్తి చికిత, దీపికా కుమారి సభ్యులుగా ఉన్న చోళా టీమ్‌ను ఓడించింది. అంతకుముందు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి టోర్నీని ఘనంగా ప్రారంభించారు.

భారతీయ సంస్కృతిలో విలువిద్యకు ప్రత్యేక స్థానం ఉందని, ఇప్పుడు మన ఆర్చర్లు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక పోటీల్లో రాణిస్తుండటం గర్వకారణమని ఆయన అన్నారు. టోర్నీ డైరెక్టర్‌ అనిల్‌ కామినేని, భారత ఆర్చరీ సంఘం అధ్యక్షుడు అర్జున్‌ ముండా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత ఆర్చర్లతో పాటు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కూడా విజయాలు అందుకున్న ఆర్చర్లను ఈ సందర్భంగా సన్మానించారు. నేడు జరిగే మూడు మ్యాచ్‌ల్లో కాకతీయ నైట్స్‌తో చోళా చీఫ్స్‌ (రాత్రి గం. 7:45 నుంచి), రాజ్‌పుతానా రాయల్స్‌తో చేరో ఆర్చర్స్‌ (రాత్రి గం. 8:20 నుంచి), మైటీ మరాఠాస్‌తో పృథ్వీరాజ్‌ యోధాస్‌ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. మ్యాచ్‌లను సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement