సౌదీ అరేబియాలోనే మెగా ఈవెంట్
సియోల్: మధ్య ఆసియాలో సంఘర్షణల నేపథ్యంలో వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్నిర్వహణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2027 జనవరి 7 నుంచి ఫిబ్రవరి 5 వరకు సౌదీ అరేబియా వేదికగా ఈ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. సౌదీలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తే ఆటగాళ్లు, అభిమానుల భద్రతపై పెరుగుతున్న ఆందోళనలపై ఆసియా కప్ నిర్వాహకులు స్పందించారు. ఆసియా ఫుట్బాల్ ప్రతినిధులతో సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు టోర్నమెంట్ నిర్వాహక కమిటీ తెలిపింది. ‘టోర్నమెంట్ కోసం ఏర్పాట్లు చరుగ్గా జరుగుతున్నాయి.
వేదికలు, సౌకర్యాలు, సహాయక సేవలు ఇలా అన్నీ రంగాల్లో మందుగా అనుకున్నట్లే పురోగమిస్తున్నాం. ఫుట్బాల్ ద్వారా ఖండాన్ని ఏకం చేస్తూ... ఆసియా నలుమూలల నుంచి వచ్చే జట్లు, అభిమానులు, మీడియాకు ప్రపంచ స్థాయి టోర్నమెంట్ అనుభవాన్ని అందించడంపైనే మా దృష్టి కేంద్రీకృతమై ఉంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ఆసియా ఫుట్బాల్ సమాఖ్యతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం’ అని పేర్కొంది. కాగా గత కొన్ని రోజులుగా సౌదీ అరేబియాపై యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు వరుస దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో హింస చెలరేగుతోంది.
ఇలాంటి ఘటనల్లో ఇప్పటి వరకు దాదాపు 20 మంది మృత్యువాత పడ్డారు. దీంతో టోర్నమెంట్లో పాల్గొనేందుకు జట్లు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు సౌదీలోని పరిస్థితులపై దక్షిణ కొరియా ప్లేయర్ల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఆటగాళ్ల భద్రత మాకు అత్యంత ముఖ్యం. ప్లేయర్లు, అభిమానుల ప్రాణాల కంటే ఏ టోర్నమెంట్ గొప్పది కాదు’ అని పేర్కొంది. ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం మాట్లాడుతూ... నవంబర్ వరకు వేచి చూస్తామన్నారు. అప్పటిలోగా పరిస్థితుల్లో మార్పుల్లో రావొచ్చని ఆశాభావం వ్యక్తంచేశారు.


