టీమిండియా క్రికెటర్‌ భార్య వెటకారం.. కోహ్లి, రహానేలపై సెటైర్లు!

Mayanti Langer Shares Throwback Picture From Husband Stuart Binny Test Debut Gone Viral - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్‌ స్టువర్ట్‌ బిన్నీ భార్య, ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత మయంతి లాంగర్‌.. ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఆండర్సన్‌ బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూ, వికెట్లు సమర్పించుకున్న భారత స్టార్‌ ఆటగాళ్లపై పరోక్షంగా సెటైర్లు వేసింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌ అనంతరం ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఓ స్టోరీ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. తన భర్త స్టువర్ట్ బిన్నీ బౌండరీ బాదితే, అతనికి బౌలింగ్ చేయలేక ఆండర్సన్ అసహనంతో తల పట్టుకున్న ఫోటోను ఆమె తన ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్‌ చేసింది. ఈ ఫోటో 2014 ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా తీసింది. 


ఈ మ్యాచ్‌ ద్వారా టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన బిన్నీ.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే అవుటైనా, రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ స్టోరీలో మయంతి ఎలాంటి కామెంట్లు చేయకపోయినా.. ఇంగ్లండ్‌లో ఆండర్సన్‌ను ఎదుర్కోవడం అందరి వల్లా కాదని, దానికి తన భర్తలా సపరేట్ టాలెంట్ ఉండాలని పరోక్షంగా కోహ్లి, రహానే, పుజారాపై సెటైర్లు వేసినట్లుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మయంతి చేసిన ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

కాగా, భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కొడుకైన స్టువర్ట్ బిన్నీ.. క్రికెట్ యాంకర్ మయంతి లాంగర్‌ను ప్రేమించి పెళ్లాడాడు. వీరికి గతేడాది సెప్టెంబర్‌లో ఓ కొడుకు కూడా జన్మించాడు. 37 ఏళ్ల స్టువర్ట్ బిన్నీ, ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించలేదు. చివరిసారిగా 2016లో వెస్టిండీస్‌పై టీ20 మ్యాచ్ ఆడిన బిన్నీ.. ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్నాడు.

టీమిండియా తరుపున 6 టెస్ట్‌లు ఆడిన అతను.. ఓ హాఫ్ సెంచరీతో 194 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో బిన్నీ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే, వన్డే క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మాత్రం స్టువర్ట్ బిన్నీ(6/4) పేరిటే నమోదై ఉన్నాయి. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చిన బిన్నీ.. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి, అనిల్ కుంబ్లే(6/12) రికార్డును బ్రేక్ చేశాడు.
చదవండి: అదును చూసి విరుచుకుపడ్డాం.. ఇంగ్లండ్‌ బౌలర్లను ఆకాశానికెత్తిన రూట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top