బ్రె‘జిల్‌...జిల్‌...జిల్‌’ | Marta late heroics lead Brazil to ninth Copa America Femenina title | Sakshi
Sakshi News home page

బ్రె‘జిల్‌...జిల్‌...జిల్‌’

Aug 4 2025 6:05 AM | Updated on Aug 4 2025 6:05 AM

Marta late heroics lead Brazil to ninth Copa America Femenina title

తొమ్మిదోసారి కోపా అమెరికా మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీ టైటిల్‌ సొంతం

‘షూటౌట్‌’లో 5–4 గోల్స్‌తో కొలంబియాపై విజయం

రెండు గోల్స్‌తో మెరిసిన మార్టా  

క్విటో (ఈక్వెడార్‌): ఆరుసార్లు ప్రపంచ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు నెగ్గిన మార్టా రెండు గోల్స్‌తో విజృంభించడంతో... బ్రెజిల్‌ జట్టు తొమ్మిదోసారి కోపా అమెరికా మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీ టైటిల్‌ కైవసం చేసుకుంది. ఆదివారం అత్యంత హోరాహోరీగా సాగిన ఫైనల్లో బ్రెజిల్‌ ‘షూటౌట్‌’లో 5–4 గోల్స్‌ తేడాతో కొలంబియాపై విజయం సాధించింది. 

నిరీ్ణత సమయంలో ఇరు జట్లు 4–4 గోల్స్‌తో నిలవడంతో... విజేతను తేల్చేందుకు షూటౌట్‌ అనివార్యమైంది. ఇందులో బ్రెజిల్‌ ఆధిక్యం కనబర్చింది. అంతకుముందు మ్యాచ్‌లో బ్రెజిల్‌ తరఫున మార్టా (90+6వ, 105వ నిమిషాల్లో) డబుల్‌ గోల్స్‌తో మెరవగా... ఏంజెలీనా (45+9వ నిమిషంలో), అమండా గుటెరెస్‌ (80వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. 

కొలంబియా తరఫున లిండా కైసెడో (25వ నిమిషంలో), టర్సియానె (69వ నిమిషంలో), మైరా రమిరెజ్‌ (88వ నిమిషంలో), లైసీ సంటోస్‌ (115వ నిమిషంలో) తలా ఒక గోల్‌ సాధించారు. 39 ఏళ్ల మార్టా 82వ నిమిషంలో మైదానంలో అడుగుపెట్టి బ్రెజిల్‌ స్కోరును 3–3తో సమం చేసింది. అనంతరం అదనపు సమయంలో మార్టా మరో గోల్‌ సాధించడంతో బ్రెజిల్‌ 4–3తో ఆధిక్యంలోకి వెళ్లినా... చివర్లో లైసీ గోల్‌తో కొలంబియా స్కోరు సమం చేసింది. దీంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్‌ నిర్వహించాల్సి వచ్చింది. 

ఇందులో గోల్‌ కీపర్‌ లొరెనా డా సిల్వా రెండు పెనాల్టీ కిక్‌లను సమర్థవంతంగా అడ్డుకోవడంతో... బ్రెజిల్‌ వరుసగా ఐదోసారి కోపా అమెరికా కప్‌ కైవసం చేసుకుంది. గత ఐదు ఫైనల్స్‌లో బ్రెజిల్‌ జట్టు నాలుగుసార్లు కొలంబియాపైనే విజయం సాధించడం విశేషం. బ్రెజిల్‌ తరఫున 6 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లు, 6 ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన మారా్ట... కెరీర్‌లో 206 మ్యాచ్‌లాడి 122 గోల్స్‌ సాధించింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ ఫైనల్లో అమెరికా చేతిలో ఓడిన బ్రెజిల్‌ జట్టు రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ టోరీ్నలో అమండా గుటెరెస్‌ ఆరు గోల్స్‌తో అత్యధిక స్కోరర్‌గా నిలిచింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement