
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆసీస్ గెలువగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. ఇవాళ (సెప్టెంబర్ 20) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆసీస్ మరోసారి గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ అతి భారీ స్కోర్ చేసింది. బెత్ మూనీ (75 బంతుల్లో 138; 23 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసి ఆలౌటైంది. మూనీతో పాటు జార్జియా వాల్ (81), ఎల్లిస్ పెర్రీ (68) సత్తా చాటారు.
అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ పోరాడి ఓడింది. స్మృతి మంధన (63 బంతుల్లో 125; 17 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత శతకంతో విజృంభించినా, లక్ష్యానికి 44 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
మంధనతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (52), దీప్తి శర్మ (72) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ 47 ఓవర్లలో 369 పరుగులు చేసి ఆలౌటైంది. మంధన, హర్మన్ క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. వీరిద్దరూ ఔటైన తర్వాత కూడా దీప్తి శర్మ కాసేపు ఆశలు రేకెత్తించింది. అయితే భారత చివరి వరుస బ్యాటర్లు త్వరితగతిన ఔట్ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.