సన్‌రైజర్స్‌ ఆశలు గల్లంతు! 

Lucknow Super Giants beat Sunrisers Hyderabad by 7 wickets - Sakshi

సొంతగడ్డపై ఐదో ఓటమి 

‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు దాదాపు దూరం 

7 వికెట్లతో లక్నో గెలుపు  

ఉప్పల్‌ పిచ్‌పై 182 పరుగుల స్కోరు మెరుగైందే... బౌలర్లు కూడా సత్తా చాటడంతో 15 ఓవర్లదాకా మ్యాచ్‌ హైదరాబాద్‌ చేతుల్లోనే ఉంది. అప్పటికి లక్నో స్కోరు 114/2. ఓవర్‌కు దాదాపు 14  పరుగుల చొప్పున 30 బంతుల్లో 69 పరుగులు  కావాలి. అయితే తర్వాతి ఓవరే హైదరాబాద్‌ను  ముంచింది. మ్యాచ్‌ ఫలితాన్నే తారుమారయ్యేలా చేసింది. అభిషేక్‌ శర్మ వేసిన ఈ ఓవర్లో స్టొయినిస్, పూరన్‌ కలిసి 5 సిక్సర్లతో పండుగ చేసుకున్నారు. వైడ్‌తో కలిపి 31 పరుగులు రాగా సమీకరణం 24  బంతుల్లో 38 పరుగులుగా మారి లక్నో విజయాన్ని సులువుగా మార్చింది. ఈ ఓటమితో హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలకు దాదాపు తెర పడినట్లే!  

సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. సన్‌రైజర్స్‌కు ఇది ఏడో పరాజయం కాగా, ఇందులో ఐదు మ్యాచ్‌ల్ని సొంతగడ్డపైనే ఓడటం గమనార్హం. శనివారం  జరిగిన పోరులో హైదరాబాద్‌ 7 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. ముందుగా సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

హెన్రిచ్‌ క్లాసెన్‌ (29 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అబ్దుల్‌ సమద్‌ (25 బంతుల్లో 37 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన లక్నో 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ప్రేరక్‌ మన్కడ్‌ (45 బంతుల్లో 64 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా, నికోలస్‌ పూరన్‌ (13 బంతుల్లో 44 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచేశాడు.  

ధాటిగా ఆడినా... 
పవర్‌ప్లేలోనే సన్‌రైజర్స్‌ 2 కీలక వికెట్లను కోల్పోయినా పరుగుల ధాటి మాత్రం కొనసాగింది.  అన్‌మోల్‌ప్రీత్‌ (27 బంతుల్లో 37; 7 ఫోర్లు), మార్క్‌రమ్‌ (20 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) స్కోరు బోర్డును పరుగెత్తించారు. అయితే కృనాల్‌ పాండ్యా వరుస బంతుల్లో మార్క్‌రమ్, ఫిలిప్స్‌ (0)లను అవుట్‌ చేసి ఇన్నింగ్స్‌ వేగానికి కళ్లెం వేశాడు. అనంతరం క్లాసెన్, సమద్‌లు సిక్సర్లతో విరుచుకుపడి బలమైన స్కోరుకు బాట వేశారు.  

ఆ ఓవర్‌తోనే తారుమారు! 
పిచ్‌ సహకారంతో, సొంతగడ్డ అనుకూలతలతో ఆరంభంలో హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టగా బౌలింగ్‌ చేశారు. కైల్‌ మేయర్స్‌ (2) విఫలం కాగా, డికాక్‌ (19 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ప్రేరక్‌ కలిసి జట్టును ఆదుకున్నారు. 15వ ఓవర్‌ పూర్తయ్యేసరికి లక్నో చేసింది 114/2 స్కోరే. తర్వాతి ఓవర్‌ను అభిషేక్‌కు అప్పగించడంతో మ్యాచ్‌ సీనే మారిపోయింది. 2 సిక్స్‌లు కొట్టిన స్టొయినిస్‌ (25 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మూడో బంతికి అవుటైతే... పూరన్‌ వచ్చి 3 బంతుల్నీ సిక్సర్లుగానే మలిచాడు.

మైదానంలోకి ‘బోల్ట్‌’ 
ఉప్పల్‌ మ్యాచ్‌లో ప్రేక్షకుల అనుచిత ప్రవ ర్తన కారణంగా కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగింది. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో అవేశ్‌ వేసిన 19వ ఓవర్‌ మూడో బంతిని ఎత్తు కారణంగా అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించాడు. దీనిపై లక్నో రివ్యూ కోరగా, సుదీర్ఘ సమయం తీసుకున్న థర్డ్‌ అంపైర్‌ అది ‘సరైన బంతి’ అంటూ వారికి అనుకూలంగా తీర్చిచ్చాడు. అదే ఓవర్లో బౌండరీ వద్ద లక్నో ఫీల్డర్లు ప్రేక్షకుల ప్రవర్తనపై ఫిర్యాదు చేయడంతో ఆట ఆగిపోయింది.

ఒక ప్రేక్షకుడు కుర్చీకి  ఉండే నట్‌ బోల్ట్‌ను మైదానంలోకి విసిరాడు. ఆ బోల్ట్‌ ప్రేరక్‌ తలకు తగిలింది.  దాంతో లక్నో సహాయక సిబ్బంది కూడా మైదానంలోకి వెళ్లి తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంపైర్లు వెతికి చూడగా గ్రౌండ్‌లో ఆ ఇనుప బోల్ట్‌ కనిపించింది. పోలీసులు స్టాండ్స్‌లోకి వెళ్లి విచారించినా ఆ వ్యక్తిని గుర్తించలేకపోగా, కొద్ది సేపటికి ఆట మళ్లీ మొదలైంది. నోబాల్‌ విషయంలో అంపైర్లపై బహిరంగ నిరసన వ్యక్తం చేసిన క్లాసెన్‌కు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం జరిమానా పడింది.   

స్కోరు వివరాలు 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అన్‌మోల్‌ప్రీత్‌ (సి అండ్‌ బి) మిశ్రా 36; అభిషేక్‌ (సి) డికాక్‌ (బి) యు«ద్‌వీర్‌ 7; త్రిపాఠి (సి) డికాక్‌ (బి) యశ్‌ 20; మార్క్‌రమ్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) కృనాల్‌ 28; క్లాసెన్‌ (సి) మన్కడ్‌ (బి0 అవేశ్‌ 47; ఫిలిప్స్‌ (బి) కృనాల్‌ 0; సమద్‌ నాటౌట్‌ 37; భువనేశ్వర్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–19, 2–56, 3–82, 4–115, 5–115, 6–173. బౌలింగ్‌: యుధ్‌వీర్‌ 3–0–24–1, మేయర్స్‌ 1–0–11–0, కృనాల్‌ పాండ్యా 4–0–24–2, అవేశ్‌ 2–0–30–1, యశ్‌ ఠాకూర్‌ 4–0–28–1, అమిత్‌ మిశ్రా 4–0–40–1, రవి బిష్ణోయ్‌ 2–0–23–0. 

లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మేయర్స్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) ఫిలిప్స్‌ 2; డికాక్‌ (సి) అభిషేక్‌ (బి) మార్కండే 29; ప్రేరక్‌ నాటౌట్‌ 64; స్టొయినిస్‌ (సి) సమద్‌ (బి) అభిషేక్‌ 40; పూరన్‌ నాటౌట్‌ 44; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.2 ఓవర్లలో 3 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–12, 2–54, 3–127. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–30–0, ఫారుఖీ 3.2–0–32–0, ఫిలిప్స్‌ 2–0–10–1, నటరాజన్‌ 4–0–31–0, మార్కండే 3–0–39–1, అభిషేక్‌ 3–0–42–1.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top