ఢిల్లీ ఆశలు పదిలం! | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఆశలు పదిలం!

Published Wed, May 15 2024 4:16 AM

Lucknow lost by 19 runs

చివరి లీగ్‌ మ్యాచ్‌లో విజయం

19 పరుగులతో ఓడిన లక్నో

రాణించిన స్టబ్స్, పొరేల్, ఇషాంత్‌ 

‘ప్లే ఆఫ్స్‌’కు రాజస్తాన్‌ రాయల్స్‌  

న్యూఢిల్లీ: సొంతగడ్డపై సత్తా చాటిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌ లీగ్‌ దశను విజయంతో ముగించింది. ఈ గెలుపుతో సాంకేతికంగా ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నా... ఆ జట్టు ముందంజ వేయడం చాలా రకమైన ఇతర సమీకరణాలపై ఆధారపడి ఉంది. మరోవైపు గెలిస్తే ప్లే ఆఫ్స్‌ రేసులో మెరుగైన స్థితికి చేరే అవకాశం ఉన్నా కూడా లక్నో సూపర్‌ జెయింట్స్‌ దానిని చేజార్చుకుంది. 

మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 19 పరుగుల తేడాతో లక్నోపై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అభిõÙక్‌ పొరేల్‌ (33 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (25 బంతుల్లో 57 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... షై హోప్‌ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌ (23 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించారు. 

అనంతరం లక్నో 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసి ఓడిపోయింది. నికోలస్‌ పూరన్‌ (27 బంతుల్లో 61; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), అర్షద్‌ ఖాన్‌ (33 బంతుల్లో 58 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా మిగతా వారంతా పూర్తిగా విఫలమయ్యారు. ఢిల్లీ–లక్నో మ్యాచ్‌ ఫలితంతో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే రాజస్తాన్‌ రాయల్స్‌ 16 పాయింట్లతో ‘ప్లే ఆఫ్స్‌’కు బెర్త్‌ను ఖరారు చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది.  

కీలక భాగస్వామ్యం... 
తొలి ఓవర్లోనే జేక్‌ ఫ్రేజర్‌ (0)ను అవుట్‌ చేసిన లక్నో ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. పొరేల్, హోప్‌ కలిసి దూకుడుగా ఆడారు. అర్షద్‌ ఓవర్లో పొరేల్‌ 3 ఫోర్లు, సిక్స్‌ కొట్టగా, యు«ద్‌వీర్‌ ఓవర్లో హోప్‌ 2 ఫోర్లు, సిక్స్‌ బాదాడు. పవర్‌ప్లేలో ఢిల్లీ 73 పరుగులు చేసింది.

21 బంతుల్లోనే పొరేల్‌ అర్ధసెంచరీ పూర్తి కాగా, ఈ జోడీ రెండో వికెట్‌కు 92 పరుగులు (49 బంతుల్లో) జోడించింది. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా, పంత్‌ కొన్ని కీలక పరుగులు సాధించాడు. అయితే స్టబ్స్‌ ధాటైన బ్యాటింగ్‌ ఢిల్లీ స్కోరును 200 దాటించింది. అర్షద్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన అతను, నవీన్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ బాది 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు.  

పూరన్‌ మినహా... 
భారీ ఛేదనలో లక్నో పూర్తిగా తడబడింది. పూరన్‌ మెరుపు బ్యాటింగ్‌ తప్ప ఇన్నింగ్స్‌లో ప్రధాన బ్యాటర్‌ ఒక్కరు కూడా కనీస ప్రదర్శన ఇవ్వలేకపోయారు. పవర్‌ప్లే ముగిసేలోపే కేఎల్‌ రాహుల్‌ (5), డికాక్‌ (12), స్టొయినిస్‌ (5), హుడా (0) వెనుదిరగడం జట్టును బాగా దెబ్బ తీసింది. 

మరోవైపు అక్షర్‌ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన పూరన్‌... ఇతర బౌలర్లపై కూడా చెలరేగి 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే లక్నోను విజయం దిశగా తీసుకెళ్లేందుకు ఇది సరిపోలేదు. విజయానికి 9 ఓవర్లలో 108 పరుగులు చేయాల్సిన స్థితిలో పూరన్‌ అవుట్‌ కావడంతో జట్టు ఆశలు కోల్పోయింది. చివర్లో అర్షద్‌ పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది.  

స్కోరు వివరాలు 
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: జేక్‌ ఫ్రేజర్‌ (సి) నవీన్‌ (బి) అర్షద్‌ 0; పొరేల్‌ (సి) పూరన్‌ (బి) నవీన్‌ 58; హోప్‌ (సి) రాహుల్‌ (బి) బిష్ణోయ్‌ 38; పంత్‌ (సి) హుడా (బి) నవీన్‌ 33; స్టబ్స్‌ (నాటౌట్‌) 57; అక్షర్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–2, 2–94, 3–111, 4–158. బౌలింగ్‌: అర్షద్‌ 3–0–45–1, మొహసిన్‌ 4–0–29–0, యుధ్‌వీర్‌ 2–0–28–0, నవీన్‌ 4–0–51–2, బిష్ణోయ్‌ 4–0–26–1, కృనాల్‌ 2–0–20–0, హుడా 1–0–9–0.  

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) ముకేశ్‌ (బి) ఇషాంత్‌ 12; రాహుల్‌ (సి) ముకేశ్‌ (బి) ఇషాంత్‌ 5; స్టొయినిస్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అక్షర్‌ 5; హుడా (ఎల్బీ) (బి) ఇషాంత్‌ 0; పూరన్‌ (సి) అక్షర్‌ (బి) ముకేశ్‌ 61; బదోని (సి) గుల్బదిన్‌ (బి) స్టబ్స్‌ 6; కృనాల్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) కుల్దీబ్‌ 18; అర్షద్‌ (నాటౌట్‌) 58; యుధ్‌వీర్‌ (సి) హోప్‌ (బి) ఖలీల్‌ 14; బిష్ణోయ్‌ (రనౌట్‌) 2; నవీన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–7, 2–24, 3–24, 4–44, 5–71, 6–101, 7–134, 8–167, 9–183. బౌలింగ్‌: ఇషాంత్‌ 4–0–34–3, ఖలీల్‌ 2–0–22–1, అక్షర్‌ 1–0–20–1, ముకేశ్‌ 4–0–33–1, కుల్దీప్‌ 4–0–33–1, స్టబ్స్‌ 1–0–4–1, గుల్బదిన్‌ 1–0–12–0, సలామ్‌ 3–0–30–0.   

ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్‌ X పంజాబ్‌ 
వేదిక: గువాహటి
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement
 
Advertisement
 
Advertisement