
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే యశస్వి జైశ్వాల్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వికెట్లు కోల్పోయిన భారత జట్టును.. తన సూపర్ పెర్ఫార్మెన్స్‌తో రాహుల్ ఆదుకున్నాడు.
రిషబ్ పంత్‌తో కలిసి నాలగో వికెట్‌కు 140 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 177 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి రాహుల్ ఔటయ్యాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
మూడో ప్లేయర్‌గా..
సేనా( దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన మూడో ఏసియన్ బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు. రాహుల్‌కు ఇది సేనా దేశాల్లో 11వ ఫిప్టీ స్కోర్ కావడం విశేషం. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, బంగ్లా మాజీ ప్లేయర్ తమీమ్ ఇక్భాల్, సయీద్ అన్వర్ పేరిట సంయుక్తంగా ఉండేది.
ఈ దిగ్గజ ఆటగాళ్లు తమ కెరీర్‌లో సేనా దేశాల్లో 10 సార్లు 50+ పరుగులు చేశారు. తాజా ఇన్నింగ్స్‌తో వీరిని కేఎల్ అధిగమించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో సునీల్ గవాస్కర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. అతడు 12 సార్లు 19 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్ధానంలో దిముత్ కరుణరత్నే(12) కొనసాగుతున్నాడు.
ఇక లార్డ్స్ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా రెండు పరుగులు చేసింది.