అఫ్గానిస్తాన్‌తో ఈ నెల 6 నుంచి జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. మంగళవారం ముల్లాన్‌పూర్‌కు చేరుకున్న టీమిండియా తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్ కోసం రెగ్యులర్ టీమ్ సభ్యులతో పాటు అదనంగా నెట్ ప్రాక్టీస్ కోసం ఆరుగురు బౌలర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. పేసర్లు ఆఖిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, గుర్‌జప్‌నీత్ సింగ్ పేస్ బౌలింగ్‌ను నెట్స్‌లో భారత బ్యాటర్లు ఎదుర్కోనున్నారు.
లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారి, ఎడంచేతి వాటం మణికట్టు స్పిన్నర్ శివాంగ్ కుమార్, ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. టెస్టు జట్టులోని ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఐదు రోజుల వ్యవధిలో మూడు కీలక మ్యాచ్‌లు ఆడి తీవ్రంగా అలసిపోయారు.
వేడి వాతావరణం నేపథ్యంలో వారికి తగినంత విశ్రాంతినిచ్చేందుకు నెట్ బౌలర్ల అవసరం ఏర్పడిందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. టెస్టుకు ముందు భారత బ్యాటర్లకు తగినంత ప్రాక్టీస్ అవసరమని, అందుకే అదనపు బౌలర్లను ఎంపిక చేశామని ఆయన అభిప్రాయపడ్డారు.
కెప్టెన్‌గా రాహుల్!
కాగా ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే ఆటగాళ్లు ముల్లన్‌పూర్ చేరుకోవాల్సి ఉన్నప్పటికీ, కొంతమంది కీలక ఆటగాళ్లు ఇంకా జట్టుతో కలవలేదు. ఈ జాబితాలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు తన సహచరులు సాయి సుదర్శన్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. వీరంతా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడిన గుజరాత్ జట్టులో భాగంగా ఉన్నారు.
అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఊహించని ఘటన వల్ల గుజరాత్ ఆటగాళ్లు తొలి బృందంతో కలిసి చండీగడ్‌కు చేరుకోలేకపోయారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు గిల్‌తో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిల్ స్ధానంలో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా సిరాజ్ స్ధానంలో గుర్నూర్ బ్రార్ టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశముంది.
ఆఫ్ఘనిస్తాన్ టెస్టుకు భారత జట్టు
శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, హర్ష్ దూబే, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్)
నెట్ బౌలర్లు: గుర్జప్‌నీత్ సింగ్, అకిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, శరన్ష్ జైన్, జీషన్ అన్సారీ, శివంగ్ కుమార్


