వాటే మ్యాచ్‌.. కేకేఆర్‌ విన్నర్‌

KKR Beat Kings Punjab By 2 Runs - Sakshi

కింగ్స్‌ పంజాబ్‌ మళ్లీ ఓడింది..

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు‌ ఓటమి తప్పలేదు. కేకేఆర్‌ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ ఛేదనలో కింగ్స్‌ పంజాబ్‌ గెలుపు అంచుల వరకూ వచ్చి పరాజయం పాలైంది. ఈ ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో కింగ్స్‌ పంజాబ్‌ను ఓటమి వెక్కిరించింది.  నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన కింగ్స్‌ పంజాబ్‌ 162 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌(74; 58 బంతుల్లో 6 ఫోర్లు), మయాంక్‌ అగర్వాల్‌(56; 39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)లు రాణించినా మిగతా వారు విఫలమయ్యారు. కింగ్స్‌ పంజాబ్‌కు 14 పరుగులు అవసరమైన తరుణంలో రాహుల్‌ బౌల్డ్‌ కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. 19 ఓవర్‌ ఆఖరి బంతికి రాహుల్‌ను ప్రసిద్ధ్‌ క్రిష్ణ బౌల్డ్‌ చేయడంతో మ్యాచ్‌ టర్న్‌ అయిపోయింది. చివరి ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ రెండు ఫోర్లు కొట్టినా ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్‌ వేసిన సునీల్‌ నరైన్‌ 11 పరుగుల్చి వికెట్‌ తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్లు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా ఓటమి పాలుకావడం ఆ జట్టు బ్యాటింగ్‌ వైఫల్యాన్ని మరొకసారి చూపెట్టింది. ఆఖరి బంతికి మ్యాక్స్‌వెల్‌ ఫోర్‌ కొట్టడంతో రెండు పరుగుల తేడాతో పరాజయం చెందింది. కేకేఆర్‌ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ మూడు వికెట్లు సాధించగా, నరైన్‌ రెండు వికెట్లు తీశాడు.(చదవండి: ‘గేల్‌ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’)

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 164 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌(57; 47 బంతుల్లో 5 ఫోర్లు),  దినేశ్‌ కార్తీక్‌(58; 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో కేకేఆర్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను  రాహుల్‌ త్రిపాఠి, శుబ్‌మన్‌ గిల్‌లు ఆరంభించారు. కాగా, రాహుల్‌ త్రిపాఠి(4) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో త్రిపాఠిని షమీ బౌల్డ్‌ చేశాడు. అనంతరం నితీష్‌ రాణా(2) రనౌట్‌ అయ్యాడు. ఈ రనౌట్‌ అయ్యే క్రమంలో నాటకీయ  పరిణామాలు చోటుచేసుకున్నాయి.  అర్షదీప్‌ వేసిన నాల్గో ఓవర్‌ మూడో బంతిని శుబ్‌మన్‌ గిల్‌ షార్ట్‌ ఫైన్‌లెగ్‌లోకి ఆడాడు. అయితే ఆ సమయంలో ఫీల్డర్‌ ఉన్నాడు. కానీ దాన్ని గ్రహించని నాన్‌స్టైకర్‌ నితీష్‌ రాణా స్టైకింగ్‌ ఎండ్‌ వైపు పరుగు తీసి అనవరసంగా వికెట్‌ సమర్పించుకున్నాడు.

ఆపై ఇయాన్‌ మోర్గాన్‌-గిల్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.  వీరిద్దరూ 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత మోర్గాన్‌(24) ఔటయ్యాడు. ఆ తరుణంలో గిల్‌కు -దినేశ్‌ కార్తీక్‌ జత కలిశాడు. అయితే ఎటువంటి ఆశలు లేని కార్తక్‌ మాత్రం ఈసారి మెరిశాడు. దినేశ్‌ కార్తీక్‌ బ్యాట్‌ నుంచి చూడచక్కని ఇన్నింగ్స్‌ వచ్చి చాలా కాలమే అయ్యింది. సొగసైన బౌండరీలతో అలరించాడు. ఈ జోడి 82 పరుగుల జోడించిన తర్వాత గిల్‌ ఔటయ్యాడు. దాంతో కేకేఆర్‌ తిరిగి తేరుకుంది. అటు తర్వాత కార్తీక్‌ అర్థ శతకం మార్కును చేరి బ్యాటింగ్‌లో సత్తాచాటి స్కోరు బోర్డును చక్కదిద్దాడు. దినేశ్‌ కార్తీక్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో కేకేఆర్‌ పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది.. రసెల్‌(5) మరోసారి విఫలయ్యాడు. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ, అర్షదీప్‌ సింగ్‌, రవిబిష్నోయ్‌లు తలో వికెట్‌ సాధించారు. ఆఖరి బంతికి కార్తీక్‌ రనౌట్‌ అయ్యాడు. ముగ్గురు కేకేఆర్‌ ఆటగాళ్లు రనౌట్‌ అయ్యారు. ఇది కేకేఆర్‌కు నాల్గో విజయం కాగా, పంజాబ్‌కు ఆరో ఓటమి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top