
PC: X
టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (Karun Nair)కు చేదు అనుభవమే మిగిలింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. సత్తా చాటలేకపోయాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టు (Ind vs Eng)తో రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్.. మొదటి ప్రయత్నంలోనే డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు.
రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఇరవై పరుగులు మాత్రమే చేయలిగిన 33 ఏళ్ల కరుణ్.. రెండో టెస్టులోనూ తేలిపోయాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో వరుసగా 31, 26 పరుగులు చేశాడు. లార్డ్స్ టెస్టులో మాత్రం అతడు కాస్త ఫర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చి 62 బంతులు ఎదుర్కొని 40 పరుగులు చేశాడు.
పాత కథే పునరావృతం
రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ పాత కథే పునరావృతం. కేవలం 14 పరుగులే చేసి కరుణ్ నాయర్ నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో అతడి ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పటికే మూడు అవకాశాలు ఇచ్చినా కరుణ్ తనను తాను నిరూపించుకోలేకపోయాడని.. ఇకనైననా అతడి స్థానంలో యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్లు పెరిగాయి.
వేటు పడింది
అందుకు తగ్గట్లుగానే నాలుగో టెస్టులో కరుణ్ నాయర్‌పై వేటువేసిన యాజమాన్యం.. సాయి సుదర్శన్‌కు పిలుపునిచ్చింది. మాంచెస్టర్ మ్యాచ్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సద్వినియోగం చేసుకున్నాడు. 151 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 61 పరుగులు సాధించాడు. తద్వారా భారత తొలి ఇన్నింగ్స్‌లో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.
ఒకవేళ సాయి ఇలాగే అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటే.. కరుణ్ నాయర్‌కు చెక్ పడిందనే చెప్పవచ్చని నవజ్యోత్ సింగ్ సిద్ధు వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏడ్చేసిన కరుణ్ .. ఓదార్చిన రాహుల్..
బ్లూ జెర్సీ వేసుకున్న కరుణ్ నాయర్ ఏడుస్తున్నట్లుగా కనిపిస్తుండగా.. టీమిండియా ఓపెనర్, కరుణ్ చిన్ననాటి స్నేహితుడు కేఎల్ రాహుల్ అతడి ఓదారుస్తున్నట్లుగా ఉంది. ఇది చూసిన అభిమానులు కరుణ్ నాయర్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక గుడ్‌బై!?
కాగా టీమిండియా చివరగా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడింది. నాడు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనకు ముందు విరాట్ కోహ్లిని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉన్న ఫొటోలతో.. కరుణ్ ఫొటో పోలుస్తున్నారు.
కాగా ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే అశూ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో గురువారం నాటి రెండో ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ కేవలం రెండు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.
చదవండి: సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా? బుమ్రాకు ఏమైంది?: పాంటింగ్ ఫైర్