
డీజీపీని ఆదేశించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
కర్ణాటక క్రికెట్ సంఘం, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ల మెడకు ఉచ్చు
జ్యుడీషియల్ విచారణకు ఆదేశం
నివేదిక కోరిన కర్ణాటక హైకోర్టు
తొక్కిసలాటపై సచిన్, కపిల్‌దేవ్ దిగ్భ్రాంతి
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన ఐపీఎల్ ట్రోఫీ విజయ సంబరాలు బెంగళూరులో 11 మంది కుటుంబాలను విషాదంలో ముంచాయి. దీంతో టైటిల్ గెలిచిన ఆనందం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) శిబిరంలో ఆవిరైంది. ఈ దుర్ఘటనను తీవ్రంగా పరిగణించిన కర్ణాటక సీఎం సిద్ధారామయ్య ఆర్‌సీబీ ప్రతినిధుల్ని అరెస్టు చేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.
విధుల్లో నిర్లక్షంగా వ్యవహరించిన బెంగళూరు కమిషనర్ దయానంద్ సహా ఐదుగురు పోలీసు అధికారుల్ని సైతం సర్కారు సస్పెండ్ చేసింది. పలువురు దిగ్గజ క్రికెటర్లు పెను విషాదంపై విచారం వెలిబుచ్చారు. బెంగళూరు పోలీసులు ఫ్రాంచైజీ సహా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘంపై కేసు నమోదు చేసింది. కర్ణాటక హైకోర్టు తక్షణ నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట దుర్ఘటనపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఏకంగా 11 మంది మృత్యువాత పడిన ఈ విషాద ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం సిద్ధరామయ్య దుర్ఘటనకు బాధ్యులైన వారిలో ఎవరినీ విడిచిపెట్టొద్దని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రతినిధుల్ని వెంటనే అరెస్టు చేయాలని, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ డీఎన్‌ఏ, కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) ఉన్నతాధికారుల్ని సైతం అదుపులోకి తీసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం ఆదేశించారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన బెంగళూరు నగర్ పోలీస్ కమిషనర్ దయానంద్ సహా ఐదుగురు అధికారుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. జ్యుడీషియల్ విచరాణ కోసం హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ మైకేల్ డికున్హా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. కేసు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లో తొలిసారి టైటిల్ గెలవడంతో బుధవారం బెంగళూరులో విజయోత్సవ సంబరాలు విషాదంగా ముగిశాయి.
చిన్నస్వామి స్టేడియం ప్రేక్షకుల సామర్థ్యానికి పదిరెట్లకు మించి పోటెత్తిన అభిమాన సందోహాన్ని పోలీసులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమైన ఆర్‌సీబీ ఫ్రాంచైజీ యాజమాన్యం, కేఎస్‌సీఏ, డీఎన్‌ఏపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన నిందితులు ఏ1గా ఆర్‌సీబీపై కేసులు మోపారు. ఏ2గా డీఎన్‌ఏ, ఏ3గా కేఎస్‌సీఏపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని బెంగళూరు పోలీసులు తెలిపారు.
కుబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహితలోని 105, 115, 118, 190, 132, 125, 142, 121 సెక్షన్ల కింద పలు నేరారోపణలలతో కేసులు నమోదు చేశారు. అయితే విషాదఘటన అనంతర విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆర్‌సీబీ యాజమాన్యం ప్రకటించింది. పోలీసు దర్యాప్తునకు, రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు సహకారం అందజేస్తామని ఆర్‌సీబీ తెలిపింది.
ప్రస్తుత పరిస్థితిపై...
తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు స్పందించింది. తాత్కాలిక చీఫ్ జస్టిస్ కామేశ్వర్ రావు, జస్టిస్ సీఎమ్ జోషిలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రజా ప్రయోజనార్థం కేసును సుమోటోగా స్వీకరించింది. ప్రస్తుత పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హృదయ విదారక దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారు, చికిత్స పొందుతున్న వారి వివరాలు సహా ప్రభుత్వం, పోలీసులు తక్షణం చేపట్టిన చర్యలు తదితర వివరాలతో కూడిన సంపూర్ణ నివేదిక ఇవ్వాల్సిందిగా కర్ణాటక సర్కారును డివిజన్ బెంచ్ ఆదేశించింది.
ఆర్‌సీబీ పరిహారం
ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. కేఎస్‌సీఏ కూడా రూ. 5 లక్షలు పరిహారం ఇస్తామంది. తాజాగా బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్యం ఆర్‌సీబీ కూడా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారంగా అందజేస్తామని తెలిపింది.

దిగ్గజాల దిగ్భ్రాంతి
సంబరాల కంటే ప్రాణాలే ముఖ్యమని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. ‘ఈ ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. ఇకనైనా మనం పాఠాలు నేర్వాలి. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. పొరపాట్లు జరగడం సహజమై ఉండొచ్చు... కానీ ఆ పొరపాట్లకు ప్రాణాలే మూల్యంగా చెల్లించుకోవడం అత్యంత విచారకరం. భవిష్యత్తులో ఏ జట్టయినా సరే టైటిల్ సాధిస్తే హుందాగా నడుచుకోవాలి. మితిమీరిన సంబరాలు, వేడుకల కంటే కూడా ప్రాణాలే విలువైనవని గుర్తుంచుకోవాలి’ అని కపిల్ విచారం వెలిబుచ్చారు.
సామాజిక సైట్ ‘ఎక్స్’లో సచిన్ టెండూల్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తొక్కిసలాట నన్ను నిర్ఘాంతపరిచిందని, బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పోస్ట్ చేశాడు. గతంలో ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ విషాదకర ఘటనపై విచారం వెలిబుచ్చాడు. బెంగళూరుకు చెందిన మాజీ భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే క్రికెట్‌కు ఇదొక దుర్దినం అని అన్నారు.
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన కుంబ్లే క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని అన్నారు. భారత హెడ్ కోచ్ గంభీర్ తాను ఇలాంటి రోడ్ షో విజయోత్సవాలకు వ్యతిరేకమని అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని సూచించారు.