
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 44వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్-2 పోటీల్లో భాగంగా నార్తంప్టన్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌తో మిడిల్‌సెక్స్ తరఫున అరంగేట్రం చేసిన కేన్.. తన తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టి తన క్లాస్‌ను నిరూపించుకున్నాడు. 147 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన కేన్.. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 114 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో కేన్‌తో పాటు మ్యాక్స్ హోల్డన్ (151) కూడా సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న మిడిల్‌సెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు రెండో సెషన్ సమయానికి ఆ జట్టు 129 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 546 పరుగులు చేసింది. కెప్టెన్ లూస్ డు ప్లూయ్ (69), జాక్ క్రాక్‌నెల్ (67) క్రీజ్‌లో ఉన్నారు. మిడిల్‌సెక్స్ ఇన్నింగ్స్‌లో సామ్ రాబ్సన్ (57) కూడా అర్ద సెంచరీతో రాణించగా.. ర్యాన్ హిగ్గిన్స్ 35 పరుగులు చేశాడు. బెన్ గెడ్డెస్ డకౌటయ్యాడు.
నార్తంప్టన్‌షైర్ బౌలర్లలో బెన్ సాండర్సన్, సైఫ్ జైబ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. లియామ్ గుథ్రీ ఓ వికెట్ దక్కించుకున్నాడు. నార్తంప్టన్‌షైర్‌కు ఆడుతున్న భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. 36 ఓవర్లు వేసి ఏకంగా 144 పరుగులు సమర్పించుకున్నాడు.