
ఆసియా చాంపియన్‌షిప్‌కు జ్యోతి యర్రాజి సిద్ధం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. ఈ నెల 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరగనున్న ఈ టోర్నీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 2023లో బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలుగమ్మాయి స్వర్ణం సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశజనక ప్రదర్శన తర్వాత గాయాల నుంచి కోలుకున్న 25 ఏళ్ల జ్యోతి పూర్తి స్థాయిలో సత్తా చాటేందుకు తన టెక్నిక్‌లో మార్పులు చేసుకొని పాత పద్ధతిలోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించింది.
‘పారిస్ విశ్వక్రీడల కోసం ‘సెవెన్ స్ట్రయిడ్’ టెక్నిక్ ప్రయత్నించాను. కానీ అది నాకు ఉపయోగపడలేదు. దాని వల్ల రెండుసార్లు గాయపడ్డా. అందుకే పాత పద్దతైన ‘ఎయిట్ స్ట్రయిడ్’లోనే పరుగెత్తాలని నిర్ణయించుకున్నా. గాయాల బారిన పడకుండా ఉంటే 13 సెకన్ల లోపే లక్ష్యాన్ని చేరుతాననే నమ్మకముంది’ అని జ్యోతి చెప్పింది.
హర్డిల్స్ మధ్య అడుగుల వ్యూహాన్ని స్ట్రయిడ్ అంటారు. 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు (12.78 సెకన్లు) కలిగిన జ్యోతి... గత ఆసియా చాంపియన్‌షిప్ 200 మీటర్ల పరుగులో రజత పతకం కూడా నెగ్గింది. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 59 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం గురువారం దక్షిణ కొరియాకు బయల్దేరింది.