'స్ప్రింట్‌ క్వీన్‌' పరుగు ఆగింది | Shelly Ann Fraser bids farewell to the track | Sakshi
Sakshi News home page

'స్ప్రింట్‌ క్వీన్‌' పరుగు ఆగింది

Sep 17 2025 4:17 AM | Updated on Sep 17 2025 4:17 AM

Shelly Ann Fraser bids farewell to the track

ట్రాక్‌కు గుడ్‌బై చెప్పిన షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌

మహిళల అథ్లెటిక్స్‌లో ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’గా గుర్తింపు

ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కలిపి 24 పతకాలు

3 ఒలింపిక్‌ స్వర్ణాలు... 10 ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్వర్ణాలు... డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో 5 సార్లు విజేత... ‘పాకెట్‌ రాకెట్‌’ అథ్లెట్‌ షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ అసాధారణ ఘనతల్లో ఇవి కొన్ని... సుదీర్ఘ కాలం మహిళల స్ప్రింట్స్‌లో మెరుపులా వెలిగిన షెల్లీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌తో ఆట నుంచి తప్పుకుంది...  రెండు దశాబ్దాల అసాధారణ అథ్లెటిక్స్‌ కెరీర్‌లో ఎన్నో రికార్డులు సృష్టించి ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’గా నిలిచిన ఆమె టోక్యోలో జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చివరిసారి బరిలోకి దిగి ట్రాక్‌కు గుడ్‌బై చెప్పింది... గత పారిస్‌ ఒలింపిక్స్‌లో గాయం తర్వాతే ట్రాక్‌కు దూరమవ్వాలని భావించినా... అభిమానుల కోసం ఆగిన షెల్లీ చివరకు వీడ్కోలు పలికింది.   – సాక్షి క్రీడా విభాగం

సరిగ్గా 18 ఏళ్ల క్రితం జపాన్‌లోనే షెల్లీ ఆన్‌ విజయ ప్రస్థానం మొదలైంది. ఒసాకాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జమైకా 4–100 మీటర్ల రిలే టీమ్‌ సభ్యురాలిగా రజతం సాధించడంతో ఆమె కెరీర్‌లో తొలి పతకాన్ని అందుకుంది. ఆ తర్వాత శిఖరాలకు చేరిన షెల్లీ ఇప్పుడు తన కెరీర్‌లో ఆఖరి రేసులో పాల్గొని జపాన్‌లోనే ముగించడం విశేషం. తన ప్రధాన ఈవెంట్, ట్రాక్‌ చరిత్రలో అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా గుర్తింపునిచ్చిన 100 మీటర్ల పరుగులో పాల్గొన్న ఆమె ఆరో స్థానంతో ముగించింది. 

అయితే 38 ఏళ్ల వయసులో ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం సాధారణ విషయమేమీ కాదు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ప్రపంచంలో రెండు అత్యుత్తమ వేదికలు ఒలింపిక్స్‌ (మొత్తం 8 పతకాలు), వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (మొత్తం 16 పతకాలు) కలిపి ఓవరాల్‌గా 24 పతకాలతో షెల్లీ తనకంటూ ప్రత్యేక చరిత్ర సృష్టించుకుంది.  

బోల్ట్‌కు దీటుగా... 
దశాబ్ద కాలం పాటు మహిళల విభాగంలో ట్రాక్‌ను షెల్లీ శాసించింది. కరీబియన్‌ దేశాల తరఫున ఒలింపిక్‌ స్వర్ణం గెలిచిన తొలి మహిళగా నిలిచిన ఆమె, ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా గుర్తింపు పొందిన 276 రేస్‌లలో పాల్గొని అథ్లెటిక్స్‌ అభిమానులకు చేరువైంది. కెరీర్‌లో రంగురంగుల హెయిర్‌ స్టయిల్‌లతో బరిలోకి దిగుతూ ఆటతో పాటు ఇతరత్రా కూడా అనేక ఆకర్షణలు ప్రదర్శించిన ఆమె టోక్యోలో తన ఆఖరి రేసులో కూడా జమైకా జాతీయ రంగులు ఆకుపచ్చ, పసుపు కలగలిపిన జుట్టు, నెయిల్‌ పాలిష్‌తో బరిలోకి దిగి అలరించింది. 

అద్భుతమైన ప్రదర్శనల తర్వాత కొన్నిసార్లు వెనుకబడినా... కోలుకొని షెల్లీ మళ్లీ పైకెగసిన తీరు, తాను అనుకున్న విధంగా కెరీర్‌ను ముగించడం యువ మహిళా అథ్లెట్లకు ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. జమైకాకే చెందిన అథ్లెటిక్స్‌ దిగ్గజం బోల్ట్‌ తన పరుగుతో ప్రపంచాన్ని ఊపేస్తున్న సమయంలోనే షెల్లీ అంతర్జాతీయ ప్రస్థానం కూడా సాగింది. బోల్ట్‌కు సమాంతరంగా పత కాలు గెలవడంతో పాటు తనకంటూ జమైకా స్టార్‌గా ప్రత్యేక అధ్యాయాన్ని రచించుకోవడంలో సఫలమైంది.  

మూడు సార్లూ పతకాలతో... 
కనీస సౌకర్యాలు కూడా కరువైన పేద కుటుంబంతో పుట్టిన షెల్లీ చిన్నతనంలోనే తండ్రి దూరమయ్యాడు. ఇద్దరు సోదరులతో పాటు ఆమె తల్లి వీధిలో చిన్న చిన్న వస్తువులు అమ్మేది. అలాంటి నేపథ్యం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడం షెల్లీ ఘనతకు తార్కాణం. కోచ్‌ల మాటల చెప్పాలంటే అథ్లెటిక్స్‌లో సహజ ప్రతిభతో ఆమె దూసుకుపోగలిగింది. 

పాఠశాల స్థాయిలోనే ఆమె పరుగు అందరి దృష్టినీ ఆకర్షించిన తర్వాత వేర్వేరు దశల్లో వరుసగా సత్తా చాటుతూ తనను తాను రుజువు చేసుకుంది. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగులో పాల్గొన్నప్పుడు ఫైనల్‌కు చేరితే చాలని అనుకుంది. ఎలాంటి అంచనాలు లేకపోవడమే ఆమెకు మేలు చేసింది. ఎదురు లేకుండా దూసుకుపోయి స్వర్ణం సాధించడంతో షెల్లీ పేరు మారుమ్రోగిపోయింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ వచ్చేసరికి ఆమె అప్పటికే స్టార్‌గా మారిపోయింది. 

గత కాలపు దిగ్గజం ఫ్లారెన్స్‌ గ్రిఫిత్‌ జాయ్‌నర్‌ సరసన ఆమెను చేర్చి అంతా ఆమె ప్రదర్శన కోసం ఎదురు చూశారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ షెల్లీ మరో పసిడిని గెలుచుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌ తర్వాతే కాలి గాయం ఇబ్బంది పెట్టడంతో చివరకు కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే రిలేలో జమైకా జట్టుకు రజతం అందిచింది.  

పునరాగమనం ఘనంగా... 
రియో ఒలింపిక్స్‌ తర్వాత కెరీర్‌ మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా బిజీ అయింది. 2017లో కొడుకు పుట్టిన తర్వాత తన ప్రాధాన్యతలు మారిపోయాయని ఆమె చెప్పుకుంది. ఆమె ఆటకు గుడ్‌బై చెప్పినట్లేనని అంతా భావించారు. అయితే ‘మామీ రాకెట్‌’గా కొత్త గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా ట్రాక్‌పై షెల్లీ జోరు సాగింది. సిజేరియన్‌ ఆపరేషన్‌ తర్వాత మూడు నెలల పాటు ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి ఫ్రేజర్‌ పునరాగమనం చేసింది. 

అమ్మగా మారిన తర్వాత కూడా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో ఏకంగా 3 స్వర్ణాలు, 3 రజతాలు, మరో కాంస్యం గెలవడం ఆమె సత్తాకు నిదర్శనం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కూడా 100 మీటర్ల పరుగులో రజతాన్ని సాధించి తనలో పదును తగ్గలేదని నిరూపించింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో 200 మీటర్లకు దూరంగా ఉంటానని ముందే చెప్పిన ఆమె... 100 మీటర్లలలో పతకం గెలిచి తప్పుకోవాలని భావించింది. 

అయితే అనూహ్యంగా గాయంతో సెమీస్‌కు ముందు తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో రిటైర్మెంట్‌ను ఏడాది పాటు వాయిదా వేసి షెల్లీ ఇప్పుడు నిష్క్రమించింది. తాను సంతృప్తిగా తప్పుకుంటున్నానని, ఇన్ని ఘనతల తర్వాత ఎలాంటి చింతా లేదని ఈ జమైకా స్టార్‌ వ్యాఖ్యానించింది.

‘అమ్మ’గా గెలిచి...
కొన్నాళ్ల క్రితం షెల్లీ కొడుకు, ఎనిమిదేళ్ల జ్యోన్‌ ఆమె వద్దకు వచ్చి... ‘అమ్మా...మా స్కూల్‌లో స్టూడెంట్స్‌ తల్లుల కోసం పరుగు పందెం పెడుతున్నారు. నువ్వు తప్పనిసరిగా పాల్గొనాల్సిందే’ అని కోరాడు. తాను ఇందులో పాల్గొనడం ఏమిటి అని సందేహించినా కొడుకు మీద ప్రేమతో కాదనలేకపోయింది. వరల్డ్‌ చాంపియన్‌ పోటీలో ఉంటే తిరుగేముంది! 

రేసు మొదలు కాగానే సహజంగానే ఎవరికీ అందనంత వేగంతో షెల్లీ దూసుకుపోయి విజేతగా నిలిచింది. ఆ గెలుపులో బిడ్డ ఆనందం చూసి మురిసిపోయింది. ‘వాళ్లు నన్ను అనుమతిస్తారనే అసలు అనుకోలేదు. అయినా వారికీ అవకాశం ఉందని ఇతర పిల్లలు తల్లులు భావించడమే నాకు అమితాశ్చర్యం కలిగించింది’ అని ఆమె చెప్పింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement