
మహిళల విభాగంలో అమెరికా అథ్లెట్ ‘టాప్’
పురుషుల విభాగంలో జమైకా చిరుతకు పసిడి పతకం
100 మీటర్ల పరుగులో ప్రపంచ చాంపియన్‌లు
టోక్యో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జమైకా కొత్త చిరుత ఒబ్లిక్ సెవిల్లె పురుషుల 100 మీటర్ల స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసును ఒబ్లిక్ 9.77 సెకన్లలో ముగించి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఉసెన్ బోల్ట్ (2016) తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గిన తొలి జమైకా రన్నర్‌గా ఒబ్లిక్ సెవిల్లె నిలిచాడు. సెవిల్లెకు ఇదే వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కాగా... జమైకాకే చెందిన ఒలింపిక్ రజత పతక విజేత కిషానె థామ్సన్ (9.82 సెకన్లు) రజతం దక్కించుకున్నాడు.
డిఫెండింగ్ చాంపియన్, అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ (9.89 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. ‘ప్రపంచ చాంపియన్‌షిప్ పురుషుల 100 మీటర్ల పరుగులో ఉసెన్ బోల్ట్ తర్వాత జమైకా అథ్లెట్‌కు స్వర్ణం దక్కడం ఇదే తొలిసారి. ఈ టోర్నీ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యా. సెమీస్‌లో నా ప్రదర్శనతో సంతృప్తిపడలేకపోయా. ఫైనల్లో శక్తినంతా కూడగట్టుకొని ప్రయత్నించా. నా పూర్తి సామర్థ్యంతో పరుగు తీస్తే... అందరికంటే ముందు నిలవగలనని విశ్వసించా’ అని 24 ఏళ్ల సెవిల్లె వెల్లడించాడు.
పోటీలో ఉన్న అందరిలో అత్యుత్తమ వ్యక్తిగత టైమింగ్ ఉన్న థామ్సన్ ఆరంభంలోనే వెనుకబడిపోయాడు. ఇక అక్కడి నుంచి ఏ దశలోనూ సెవిల్లెను వెనక్కి నెట్టలేకపోయిన ఈ జమైకా అథ్లెట్ రెండో స్థానంతో సంతృప్తి పడాల్సి వచి్చంది. మహిళల 100 మీటర్లలో అమెరికా అథ్లెట్ మెలిస్సా జెఫర్సన్ వుడెన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో మెలిస్సా 10.61 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా అవతరించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇది సంయుక్తంగా అత్యుత్తమ టైమింగ్ కాగా... రెండో స్థానంలో నిలిచిన టీనా క్లాటన్ కంటే 0.15 సెకన్ల ముందే మెలిస్సా రేసు పూర్తి చేసింది. వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఇదే అత్యధిక గెలుపు వ్యత్యాసం.
జమైకాకు చెందిన టీనా క్లాటన్ (10.76 సెకన్లు), జూలియన్ అల్‌ఫ్రెడ్ (10.84 సెకన్లు; సెయింట్ లూసియా) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. జమైకా స్టార్ అథ్లెట్ షెల్లీ ఆన్ ఫ్రెజర్ ప్రైస్ 11.3 సెకన్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. రెండో రోజు పోటీలు ముగిసేసరికి అమెరికా 5 స్వర్ణాలు, ఒక కాంస్యంతో మొత్తం 6 పతకాలు సాధించి పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతుండగా... కెన్యా (2 స్వర్ణాలు), జమైకా (1 స్వర్ణం, 2 రజతాలు) వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్ కూడా ఒక్కో పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాయి.