
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బరిలో నలుగురు భారత జావెలిన్ త్రోయర్లు
న్యూఢిల్లీ: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జావెలిన్ త్రో విభాగంలో భారత్ నుంచి అత్యధికంగా నలుగురు త్రోయర్లు పాల్గొననున్నారు. టోక్యో వేదికగా ఈ నెల 13 నుంచి 21 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో పాలొననున్న అన్నీ దేశాల్లోకెల్లా... భారత్ నుంచే అత్యధికంగా నలుగురు జావెలిన్ త్రోయర్లు పోటీ పడుతున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన నీరజ్ చోప్రా భారత బృందానికి నేతృత్వం వహించనున్నాడు.
నీరజ్‌తో పాటు సచిన్ యాదవ్, యశ్‌వీర్ సింగ్, రోహిత్ యాదవ్ జావెలిన్ పోటీల్లో పాల్గొంటున్నారు. మొత్తంగా ఈ పోటీల్లో భారత్ నుంచి 19 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రోహిత్ యాదవ్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలో లేకున్నా... పలువురు త్రోయర్లు తప్పుకోవడంతో ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ర్యాంకింగ్స్ ఆధారంగా అతడికి ఆహా్వనం పంపింది.
2023లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ పోటీలకు సైతం భారత్ నుంచి నలుగురు జావెలిన్ త్రోయర్లు అర్హత సాధించగా... గాయం కారణంగా రోహిత్ పోటీ నుంచి తప్పుకున్నాడు. బుడాపెస్ట్‌లో జరిగిన ఆ పోటీల్లో నీరజ్ విజేతగా నిలవగా... కిషోర్ జెనా, డీపీ మనూ వరుసగా ఐదో, ఆరో స్థానాలు దక్కించుకున్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒకే విభాగంలో నలుగురు భారత అథ్లెట్లు పాల్గొననుండటం ఇదే తొలిసారి.
డిఫెండింగ్ చాంపియన్‌గా నీరజ్ నేరుగా ఈ పోటీలకు అర్హత సాధించాడు. ఒక్కో దేశం నుంచి అత్యధికంగా ముగ్గురు అథ్లెట్లకు మాత్రమే అవకాశం ఉన్నప్పటికీ... నీరజ్‌కు నేరుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కడంతో నలుగురికి చాన్స్ లభించింది. ఈ పోటీల అర్హత మార్క్ 85.50 మీటర్లు కాగా... నీరజ్ అంతకంటే మెరుగైన త్రోతో ముందుండగా... మిగిలిన ముగ్గురు ర్యాంకింగ్స్ ఆధారంగా పోటీలో నిలిచారు. 2023 పోటీల్లో భారత్ నుంచి 28 మంది అథ్లెట్లు పాల్గొనగా... ఈసారి ఐదుగురు మహిళలు సహా మొత్తం 19 మంది అథ్లెట్లు పోటీలో ఉన్నారు. తెలంగాణ అథ్లెట్ అగసర నందిని, స్టీపుల్ చేజర్ అవినాశ్ గాయాలతో దూరమయ్యారు.
భారత అథ్లెటిక్స్ జట్టు:
పురుషులు: నీరజ్ చోప్రా, సచిన్ యాదవ్, యశ్‌వీర్ సింగ్, రోహిత్ యాదవ్ (జావెలిన్ త్రో), మురళీ శ్రీశంకర్ (లాంగ్‌జంప్), గుల్‌వీర్ (5,000, 10,000 మీటర్లు), ప్రవీణ్, అబూబకర్ (ట్రిపుల్ జంప్), సర్వేశ్ (హైజంప్), అనిమేశ్ (200 మీటర్లు), తేజస్ (110 మీటర్ల హర్డిల్స్), సెరి్వన్ (20 కి.మీ రేస్‌వాక్), రామ్‌బాబూ, సందీప్ (35 కి.మీ. రేస్‌వాక్).
మహిళలు: పారుల్, అంకిత (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్), అన్ను రాణి (జావెలిన్ త్రో), ప్రియాంక (35 కి.మీ. రేస్‌వాక్), పూజ (800, 1500 మీ.)