
టోక్యోలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా దారుణంగా విఫలమయ్యాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన నీరజ్.. అంచనాలు తలకిందులు చేస్తూ ఎనిమిదో స్థానంతో (84.03 మీటర్లు) ముగించాడు.
2021 ఒలింపిక్స్‌లో ఇదే ప్లేస్‌లో (టోక్యో) స్వర్ణం గెలిచిన నీరజ్.. ఈసారి కనీసం కాంస్యం కూడా సాధించలేక ఉసూరుమనిపించాడు. 26 పోటీల తర్వాత నీరజ్ పతక రహితుడిగా మిగలడం ఇదే మొదటిసారి. ఈ పోటీలకు ముందు పాల్గొన్న డైమండ్ లీగ్‌లో నీరజ్ రెండో స్థానంలో (85.01) నిలిచాడు.
ఈ పోటీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్‌కు స్వర్ణం దక్కింది. 2012 ఒలింపిక్స్ ఛాంపియన్ అయిన వాల్కాట్ బల్లాన్ని (జావలిన్) 88.16 మీటర్ల దూరం విసిరాడు. బల్లాన్ని 87.38 మీటర్ల దూరం విసిరిన ఆండర్సన్ పీటర్స్‌కు (గ్రెనడా) రజతం దక్కింది. కర్టిస్ థామ్సన్‌కు (యూఎస్‌ఏ, 86.67) కాంస్యం లభించింది.
ఈ పోటీల క్వాలిఫికేషన్‌లోనే బల్లాన్ని 84.85 మీటర్ల దూరం విసిరిన నీరజ్.. ఫైనల్స్‌లో అంతకంటే హీన ప్రదర్శన చేసి 84.03 మీటర్ల దూరంతో సరిపెట్టుకున్నాడు.
మొదటి ప్రయత్నంలో 83.65 మీటర్లు నమోదు చేసిన నీరజ్.. రెండో ప్రయత్నంలో 84.03 మీటర్లతో స్వల్ప మెరుగుదల చూపించాడు. మూడో త్రో ఫౌల్ అయ్యింది. నాలుగో త్రోలో 82.86 మీటర్లు మాత్రమే వచ్చాయి. ఐదో త్రోలో తడబడి మరోసారి ఫౌల్ చేసిన నీరజ్, పోటీ నుంచి నిష్క్రమించాడు.
ఇదే పోటీల్లో భారత్‌కే చెందిన సచిన్ యాదవ్ నీరజ్ కంటే మెరుగైన ప్రదర్శన చేసి మెప్పించాడు. బల్లాన్ని 86.27 మీటర్ల దూరం విసిరి తృటిలో కాంస్యం (నాలుగో స్థానం) మిస్ అయ్యాడు. ఇదే పోటీలో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ నీరజ్ కంటే దారుణమైన ప్రదర్శన (82.75 మీటర్లు) చేసి పదో స్థానంలో నిలిచాడు.