
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 200 మీటర్లలో వరుసగా నాలుగో స్వర్ణం
టోక్యో: జమైకా దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌కు మాత్రమే సాధ్యమైన ఘనతను అమెరికా స్టార్ అథ్లెట్ నోవా లైల్స్ సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగోసారి పురుషుల 200 మీటర్ల విభాగంలో లైల్స్ విజేతగా నిలిచాడు. 42 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ చరిత్రలో ఉసేన్ బోల్ట్ (2009, 2011, 2013, 2015లలో) తర్వాత 200 మీటర్ల విభాగంలో వరుసగా నాలుగు స్వర్ణ పతకాలు నెగ్గిన రెండో అథ్లెట్‌గా లైల్స్ గుర్తింపు పొందాడు.
శుక్రవారం జరిగిన 200 మీటర్ల ఫైనల్ రేసును లైల్స్ 19.52 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించి పసిడి పతకం గెలిచాడు. 2019, 2022, 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ ఈ విభాగంలో లైల్స్
విజేతగా నిలిచాడు.
మెలిస్సా ‘స్ప్రింట్ డబుల్’
మరోవైపు మహిళల 200 మీటర్ల విభాగంలో అమెరికాకే చెందిన మెలిస్సా జెఫర్సన్ వుడెన్ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. 200 మీటర్ల ఫైనల్ రేసును మెలిస్సా 21.68 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించింది. 100 మీటర్ల విభాగంలోనూ మెలిస్సాకే బంగారు పతకం లభించింది. 2013లో షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్ తర్వాత ఒకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర్ల విభాగాల్లో పసిడి పతకాలు నెగ్గిన రెండో అథ్లెట్‌గా మెలిస్సా గుర్తింపు పొందింది.