
తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌కు అర్హత
సచిన్ యాదవ్‌కు కూడా బెర్త్
ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్ కూడా ముందుకు
నేడు జావెలిన్ త్రో మెడల్ ఈవెంట్
టోక్యో: అంతా అనుకున్నట్లు జరిగితే... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఈరోజు భారత్ పతకాల బోణీ కొట్టనుంది. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత్ నుంచి డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా, రైజింగ్ స్టార్ సచిన్ యాదవ్ ఫైనల్‌కు అర్హత సాధించారు. భారత్‌కే చెందిన మరో ఇద్దరు జావెలిన్ త్రోయర్లు యశ్‌వీర్ సింగ్, రోహిత్ యాదవ్ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం... 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా ‘హ్యాట్రిక్ పతకం’ లక్ష్యంగా నేడు మెడల్ రౌండ్‌లో బరిలోకి దిగనున్నాడు.
బుధవారం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్‌లో నీరజ్ ఒక్క ప్రయత్నంలోనే ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. క్వాలిఫయింగ్‌లో ఒక్కో జావెలిన్ త్రోయర్‌కు మూడు అవకాశాలు ఇస్తారు. జావెలిన్‌ను కనీసం 84.50 మీటర్ల దూరం విసిరిన వారు లేదా టాప్–12లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత పొందుతారు. గ్రూప్ ‘ఎ’లో పోటీపడ్డ నీరజ్ తన మొదటి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 84.85 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. గ్రూప్ ‘ఎ’.. గ్రూప్ ‘బి’ నుంచి ఓవరాల్‌గా ఏడుగురు జావెలిన్ త్రోయర్లు మాత్రమే అర్హత ప్రమాణాన్ని అధిగమించారు.
మరో ఐదుగురికి ర్యాంక్ ప్రకారం ఫైనల్ బెర్త్‌ను కేటాయించారు. అర్హత ప్రమాణాన్ని అధిగమించిన ఏడుగురిలో నీరజ్ చోప్రాతోపాటు ఆండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 89.53 మీటర్లు), జూలియన్ వెబెర్ (జర్మనీ; 87.21 మీటర్లు), జూలియస్ యెగో (కెన్యా; 85.96 మీటర్లు), వెగ్నెర్ (పోలాండ్; 85.67 మీటర్లు), పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ అర్షద్ నదీమ్ (పాకిస్తాన్; 85.28 మీటర్లు), కుర్టిస్ థాంప్సన్ (అమెరికా; 84.72 మీటర్లు) ఉన్నారు.
ఓవరాల్‌గా 8 నుంచి 12 స్థానాల్లో నిలిచిన జాకుబ్ వెద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 84.11 మీటర్లు), కెషార్న్ వాల్కట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో; 83.93 మీటర్లు), సచిన్ యాదవ్ (భారత్; 83.67 మీటర్లు), కామెరాన్ మెసెన్‌టైర్ (ఆ్రస్టేలియా; 83.03 మీటర్లు), రుమేశ్ థరంగ (శ్రీలంక; 82.80 మీటర్లు) కూడా ఫైనల్లో చోటు సంపాదించారు.
భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 53 నిమిషాల నుంచి పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ జరుగుతుంది. మరోవైపు ట్రిపుల్ జంప్ క్వాలిఫయింగ్‌లో భారత క్రీడాకారులు ప్రవీణ్ చిత్రవేల్ (16.74 మీటర్లు) 15వ స్థానంలో, అబూబకర్ (16.33 మీటర్లు) 24వ స్థానంలో నిలిచారు. 200 మీటర్లలో జాతీయ చాంపియన్ అనిమేశ్ కుజుర్ హీట్స్‌లోనే వెనుదిరిగాడు.