
నేడు నీరజ్ చోప్రా క్వాలిఫయింగ్ ఈవెంట్
టోక్యో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత హైజంపర్ సర్వేశ్ కుశారే తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్లో 30 ఏళ్ల సర్వేశ్ ఆరో ప్రయత్నంలో 2.28 మీటర్ల ఎత్తును అధిగమించాడు. ఈ క్రమంలో 2.27 మీటర్లతో 2022లో నమోదు చేసిన తన అత్యుత్తమ ప్రదర్శనను సవరించాడు. అనంతరం 2.31 మీటర్ల ఎత్తును అధిగమించేందుకు సర్వేశ్ మూడుసార్లు యత్నించి విఫలమవ్వడంతో అతనికి ఆరో స్థానం దక్కింది.
హమీష్ కెర్ (న్యూజిలాండ్; 2.36 మీటర్లు)... సాంగ్‌హైక్ వూ (దక్షిణ కొరియా; 2.34 మీటర్లు), జాన్ స్టెఫెలా (చెక్ రిపబ్లిక్; 2.31 మీటర్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు. భారత అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఈరోజు క్వాలిఫయింగ్ రౌండ్ జరగనుంది.

గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా (భారత్), సచిన్ యాదవ్ (భారత్) ... గ్రూప్ ‘బి’లో భారత్ నుంచి మరో ఇద్దరు (రోహిత్ యాదవ్, యశ్‌వీర్ సింగ్) జావెలిన్ త్రోయర్లు బరిలో ఉన్నారు. ఫైనల్లో చోటు సంపాదించేందుకు 84.50 మీటర్లను కనీస అర్హత ప్రమాణంగా నిర్ణయించారు.