
భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న ఇండియా- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఈ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను జియోహాట్‌స్టార్ యాప్ అండ్ వెబ్ సైట్‌లో వీక్షించవచ్చు.
కాగా వాస్తవానికి 2031 వరకు ఇంగ్లండ్‌లో జరిగే మ్యాచ్‌లను ప్రసారం చేసే అన్ని హక్కులను సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ కలిగి ఉంది. అయితే క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. ఈ మార్క్యూ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్‌కు సోనీ సబ్-లైసెన్స్ చేసినట్లు సమాచారం.
ఈ ఒప్పందం రెండు కంపెనీల మధ్య దాదాపు నెల రోజుల చర్చల తర్వాత జరిగనట్లు సదరు క్రికెట్ వెబ్‌సైట్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా జియోహాట్‌స్టార్ ఇప్పటికే భారత్ హోమ్ సిరీస్‌లు, ఐసీసీ టోర్నమెంట్‌లు, ఐపీఎల్, ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రసార హక్కులను కలిగి ఉంది.
ఇప్పుడు కొత్తగా ఇంగ్లండ్-భారత్ మధ్య టెస్టు సిరీస్ డిజిటల్ హక్కులను కూడా దక్కించుకుంది. ఇక ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27లో ఇదే తొలి సిరీస్. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.
కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా ఇంగ్లండ్‌కు పయనం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లు టెస్టులకు వీడ్కోలు పలకడంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2025: 'పంత్‌ను చూసి నేర్చుకోండి'.. రహానేపై సెహ్వాగ్ ఫైర్