ENG VS NZ 1st Test: చరిత్ర సృష్టించిన ఆండర్సన్‌.. గడిచిన 21 ఏళ్లలో..!

 James Anderson Takes International Wickets In 21 Different Years - Sakshi

వయసు పైబడుతున్న కొద్దీ పాత​ వైన్‌లా తయారవుతున్నట్లుంది ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ పరిస్థితి. ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, మరెన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న జిమ్మీ​.. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్ట్‌లో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టిన ఆండర్సన్‌.. గడిచిన 21 ఏళ్లలో ఏడాదికి కనీసం ఒక వికెటైనా తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 40 ఏళ్ల ఆండర్సన్‌.. నాటి నుంచి ప్రతి ఏడాది కనీసం ఒక్క వికెటైనా తీశాడు. ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంక్‌లో ఉన్న ఆండర్సన్‌ టెస్ట్‌ క్రికెట్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇప్పటికే 178 టెస్ట్‌ల్లో 677 వికెట్లు తీసి ఓవరాల్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఆండర్సన్‌.. వన్డేల్లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక వికెట్లు (194 వన్డేల్లో 269) పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అలాగే టెస్ట్‌ల్లో సచిన్‌ (200) తర్వాత అత్యధిక టెస్ట్‌లు ఆడిన క్రికెటర్‌గా, ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక టెస్ట్‌లు ఆడిన క్రికెటర్‌గా, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 1000 వికెట్లు పడగొట్టిన 216వ బౌలర్‌గా, ఇంగ్లండ్‌ తరఫున ఈ ఫీట్‌ సాధించిన తొలి బౌలర్‌గా పలు రికార్డులు నెలకొల్పాడు. తాజాగా ఆండర్సన్‌ ఖాతాలో మరో కలికితురాయి వచ్చి చేరింది. 

ఇదిలా ఉంటే, కివీస్‌తో తొలి టెస్ట్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. రాకెట్‌ వేగంతో పరుగులు సాధించి 325/9 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. బెన్‌ డక్కెట్‌ (68 బంతుల్లో 84; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్‌ (81 బంతుల్లో 89; 15 ఫోర్లు, సిక్స్‌) మెరుపు అర్ధశతకాలు సాధించి తృటిలో సెంచరీలు చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఓలీ పోప్‌ (42), బెన్‌ ఫోక్స్‌ (38) సైతం బౌండరీలతో విరుచుకుపడి జట్టు వేగంగా పరుగులు సాధించడానికి దోహదపడ్డారు.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసే సమయానికి రాబిన్సన్‌ (15 నాటౌట్‌; 3 ఫోర్లు) జోరుమీదుండగా.. జేమ్స్‌ ఆండర్సన్‌ బరిలోకి దిగలేదు. కివీస్‌ బౌలర్లలో వాగ్నర్‌ 4, సౌథీ, కుగ్గెలెన్‌  తలో 2, టిక్నర్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కివీస్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 3 వికెట్ల నష్టానికి 37 పరగులు చేసింది. కాన్వే (17), వాగ్నర్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కావాల్సినంత సమయం ఉండి, చేతిలో వికెట్‌ ఉన్నప్పటికీ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top