IPL 2026: ఆరంభం రోజునే ఇషాన్ అరుదైన రికార్డు! | Ishan Kishan Set-To-Become 1st Indian To Achieve Feat IPL History | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆరంభం రోజునే ఇషాన్ అరుదైన రికార్డు!

Mar 28 2026 1:20 PM | Updated on Mar 28 2026 1:43 PM

Ishan Kishan Set-To-Become 1st Indian To Achieve Feat IPL History

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) కెప్టెన్ ఇషాన్ కిష‌న్ ఐపీఎల్  19వ‌ సీజ‌న్ ప్రారంభ మ్యాచ్‌తోనే అరుదైన రికార్డు అందుకోనున్నాడు. ఇవాళ చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా డిఫెండింగ్ చాంపియ‌న్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ)తో ఎస్ఆర్‌హెచ్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్ర‌స్తుతం ఇషాన్ కిష‌న్ వయ‌సు 27 సంవ‌త్స‌రాల 253 రోజులు. 

దీంతో ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ చ‌రిత్ర‌లో కెప్టెన్‌గా జ‌ట్టును న‌డిపించ‌నున్న‌ రెండో అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా  ఇషాన్ కిష‌న్ నిల‌వ‌ నున్నాడు. అంతేకాదు టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగాను ఇషాన్‌ నిలవనున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో న్యూజిలాండ్‌  సీనియ‌ర్ ఆట‌గాడు కేన్ విలియ‌మ్స‌న్ ఉన్నాడు. 2018లో ఎస్ఆర్‌హెచ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు విలియ‌ మ్స‌న్ వ‌య‌సు 27 సంవ‌త్స‌రాల 244 రోజులు. 

గ‌తంలో శిఖ‌ర్ ధావ‌న్‌, మ‌నీష్‌పాండే, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌లు కూడా త‌క్కువ వ‌య‌సులోనే ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్లుగా వ్య‌వ‌హ‌రించారు. ఇక ఎస్ఆర్‌హెచ్ రెగ్యుల‌ర్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ వెన్ను నొప్పితో సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌ల‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే.  క‌మిన్స్ స్థానంలో ఇషాన్ కిష‌న్‌కు తాత్కాలికంగా నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పుతూ ఎస్ఆర్‌హెచ్ యాజ‌మాన్యం నిర్ణ‌యం తీసుకుంది. 

అయితే క‌మిన్స్  ఈ సీజ‌న్‌లో మొద‌టి స‌గం మ్యాచ్‌ల‌కు దూర‌మైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌ను ఖండించిన ఎస్ఆర్‌హెచ్ కోచ్ డేనియ‌ల్ వెటోరి క‌మిన్స్ ఆడ‌డంపై స్ప‌ష్ట‌త‌నిచ్చాడు.  క‌మిన్స్ ఫిట్‌గానే ఉన్నాడ‌ని, మ‌రో 10 నుంచి 12 రోజుల్లో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు పేర్కొన్నాడు. మ‌రోవైపు క‌మిన్స్ ఫిట్‌నెస్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా దృష్టి సారించింద‌ని తెలిపాడు. 

వ‌రుస గాయాల‌తో ఇప్ప‌టికే యాషెస్‌, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు క‌మిన్స్ దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ఇక ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైన‌ప్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్‌, ఇషాన్ కిష‌న్‌, క్లాసెన్‌, లివింగ్‌స్టోన్‌, నితీశ్‌కుమార్‌రెడ్డిలతో పటిష్టంగా కనిపిస్తుంది. అయితే కమిన్స్ లేకపోవడంతో బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ హర్షల్ పటేల్‌, జయదేవ్ ఉనాద్కట్ సహా దేశవాలీ క్రికెటర్లు కీలకం కానున్నారు.

చదవండి: వివాదంలో యువరాజ్‌ తండ్రి!

Advertisement
 
Advertisement
Advertisement