
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025కు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన ఆటగాళ్లకు తాత్కాలిక ప్రత్యామ్నాయాలకు ఎంపిక చేసుకునే వెసులుబాటును లీగ్ గవర్నింగ్ బాడీ కల్పించింది. అయితే ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆటగాళ్లకు తదుపరి సీజన్‌కు (2026) అర్హత ఉండదని తెలిపింది.
ఐపీఎల్ రూల్స్ ప్రకారం గాయపడిన ఆటగాళ్లకు మాత్రమే ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అది కూడా సీజన్‌లో వారి 12వ మ్యాచ్‌లోపే ఈ అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా గవర్నింగ్ బాడీ ఫ్రాంచైజీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.
కాగా, మే 17 నుంచి లీగ్ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా మంది విదేశీ ఆటగాళ్లు వేర్వేరు కారణాల చేత అందుబాటులోకి రావడానికి మొరాయిస్తున్నారు. దీంతో ఫ్రాంచైజీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న ఫ్రాంచైజీలకు ఈ విషయం పెద్ద తలనొప్పిగా మారింది.
ఫామ్‌లో లేని ఆటగాడు తిరిగి రాకపోతే ఫ్రాంచైజీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఫామ్‌లో ఉన్న ఆటగాడిని వేరే ఆటగాడితో భర్తీ చేయాలన్నా ఫ్రాంచైజీలకు అది పెద్ద మైనస్సే అవుతుంది. ఏది ఏమైనా కీలక దశలో ప్రత్యామ్నాయ ఆటగాడిగాని ఎంపిక చేసుకునే వెసులుబాటులో లభించడంతో ఫ్రాంచైజీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే, భారత్-పాక్ మధ్య యుద్దం కారణంగా లీగ్ వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. యుద్దం సమసిపోవడంతో లీగ్ రివైజ్డ్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ షెడ్యూల్ వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌తో క్లాష్ అయ్యింది. ఈ సిరీస్ జరగాల్సిన మే 29, జూన్ 1, 3 తేదీల్లో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రీ షెడ్యూల్ అయ్యాయి. దీంతో ప్లే ఆఫ్స్‌కు ఎంపికైన ఫ్రాంచైజీలకు సంబంధించిన ఆటగాళ్లు (ఇంగ్లండ్, వెస్టిండీస్ సిరీస్‌కు ఎంపికైన వారు) దేశమా.. ఐపీఎలా అని తేల్చుకోలేకపోతున్నారు.
దేశానికే ఆడాలని విండీస్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లపై (ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపికైన వారిని) ఎలాంటి ఒత్తిడి చేయనప్పటికీ.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాత్రం జాతీయ విధులే ముఖ్యమని తేల్చి చెప్పింది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తి కాగానే జాతీయ విధులు నిర్వర్తించేందుకు వెళ్లిపోతారు. విండీస్ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉంటారా లేరా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయంలో జరిగే వన్డే మ్యాచ్‌ల్లో పాల్గొనాల్సిన ఇంగ్లండ్, విండీస్ ఆటగాళ్లు..
జేకబ్ బేతెల్ (ఆర్సీబీ)
విల్ జాక్స్ (ముంబై ఇండియన్స్)
జోస్ బట్లర్ (గుజరాత్)
షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (గుజరాత్)
రొమారియో షెపర్డ్ (ఆర్సీబీ)
జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్ రాయల్స్), జేమీ ఓవర్టన్ (సీఎస్‌కే) కూడా ఈ సిరీస్‌కు ఎంపికైనప్పటికీ వారి ఫ్రాంచైజీలు ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించాయి.