
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్‌లో ఐపీఎల్ సంచలన ఆటగాళ్లకు శుభారంభం లభించలేదు. ఈ లీగ్‌లో ఔటర్ ఢిల్లీ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్ విధ్వంసకర బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య, ఆర్సీబీ సంచలన స్పిన్నర్ సుయాశ్ శర్మ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక నిరాశపరిచారు. లీగ్‌లో భాగంగా నిన్న న్యూఢిల్లీ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఓ మోస్తరు ప్రదర్శనలతో సరిపెట్టారు.
ప్రియాంశ్ ఆర్య 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 26 పరుగులు చేయగా.. సుయాశ్ శర్మ 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 33 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రియాంశ్‌కు మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్‌గా మలచడంలో విఫలమయ్యాడు. సుయాశ్ తన కోటా ఓవర్లు పూర్తి చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
ఈ లీగ్ ఇనాగురల్ ఎడిషన్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఐపీఎల్ అవకాశం దక్కించుకున్న ప్రియాంశ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. డీపీఎల్ 2025లో మరోసారి విధ్వంసం సృష్టిస్తాడని అతని జట్టు ఔటర్ ఢిల్లీ భారీ ఆశలు పెట్టుకుంది. ప్రియాంశ్, సుయాశ్ సామర్థ్యం మేరకు రాణించకపోవడంతో న్యూఢిల్లీ టైగర్స్ చేతిలో ఔటర్ ఢిల్లీ 40 పరుగుల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొంది.
ఈ మ్యాచ్‌లో న్యూఢిల్లీ టైగర్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగా.. ఛేదనలో సత్తా చాటలేకపోయిన ఔటర్ ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 182 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.
న్యూఢిల్లీ టైగర్స్ ఇన్నింగ్స్‌లో శివమ్ గుప్తా (89), కెప్టెన్ హిమ్మత్ సింగ్ (69) అర్ద సెంచరీలతో రాణించగా.. ఔటర్ ఢిల్లీ తరఫున సనత్ సాంగ్వాన్ (48), శ్రేష్ఠ యాదవ్ (37 నాటౌట్), ధృవ్ సింగ్ (42 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. న్యూఢిల్లీ టైగర్స్ భారీ స్కోర్ చేసినప్పటికీ.. ఔటర్ ఢిల్లీ బౌలర్ అన్షుమన్ హూడా 5 వికెట్లు తీశాడు.
ప్రియాంశ్ ఆర్య ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో 17 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 179.24 స్ట్రయిక్‌రేట్‌తో 475 పరుగులు చేశాడు. సుయాశ్ గత ఐపీఎల్ సీజన్‌లో పెద్దగా వికెట్లేమీ తీయనప్పటికీ (14 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు), కీలక సమయాల్లో పొదుపుగా బౌలింగ్ చేసి ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ప్రియాంశ్ డీపీఎల్ అరంగేట్రం సీజన్‌లో 67.56 సగటున, 198.69 స్ట్రయిక్‌రేట్‌తో 608 పరుగులు చేసి వెలుగులోకి వచ్చాడు. ప్రియాంశ్ ఓ మ్యాచ్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. అలాగే 50 బంతుల్లో 120 పరుగులు చేశాడు.