
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సీఎస్‌కేతో నిన్న (మార్చి 28) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. కష్ట సాధ్యమైన పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం అద్భుతంగా బౌలింగ్ చేసి విజయంవంతంగా లక్ష్యాన్ని కాపాడుకుంది.
బ్యాటింగ్‌లో రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సత్తా చాటగా.. బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ (4-0-21-3), లవింగ్‌స్టోన్ (4-0-28-2), యశ్ దయాల్ (3-0-18-2) మ్యాజిక్ చేశారు. ఫలితంగా ఆర్సీబీ సీఎస్‌కేను 17 ఏళ్ల తర్వాత వారి సొంత ఇలాకాలో ఓడించింది.
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకోగా.. సీఎస్‌కే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఓటమిపాలైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సీఎస్‌కే కీలక సమయాల్లో క్యాచ్‌లు జారవిడచడంతో పాటు ఫీల్డింగ్‌లో అనవసర తప్పిదాలు చేసి అదనపు పరుగులు సమర్పించుకుంది.
నూర్ అహ్మద్ (4-0-36-3), పతిరణ (4-0-36-2), ఖలీల్ అహ్మద్ (4-0-28-1) బాగానే బౌలింగ్ చేసినా మిగతా బౌలర్లు సామర్థ్యం మేరకు రాణించలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. స్లోగా ఉన్న పిచ్‌పై సీఎస్‌కే బౌలర్లు 20-30 పరుగులు అదనంగా ఇచ్చారు.
అనంతరం కష్ట సాధ్యమైన ఛేదనలో సీఎస్‌కే బ్యాటర్లు ఆదిలోనే చేతులెత్తేశారు. కనీస పోరాటం కూడా చూపలేక మ్యాచ్‌ను ఆర్సీబీకి అప్పగించారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా రచిన్ రవీంద్ర (41) ఒక్కడే క్రీజ్‌లో నిలబడి ఏదో చేసే ప్రయత్నం చేశాడు. ఆఖర్లో ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీఎస్‌కేకు పిచ్ నుంచి కూడా ఎలాంటి సహకారం లభించలేదు. వికెట్ చాలా స్లోగా ఉండింది. కొత్త బంతి కూడా వారికి కలిసి రాలేదు.
మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ వికెట్‌పై మంచి స్కోర్ చేశాము. వికెట్ చాలా స్లోగా ఉండింది. బ్యాటర్లకు ఇది అంత సులభం కాదు. సీఎస్‌కేను వారి సొంత అభిమానుల మధ్య ఓడించడం చాలా ప్రత్యేకం. ఈ వికెట్‌పై ఛేజింగ్ చేయడం అంత సులభం కాదని తెలుసు. అందుకే 200 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. నేను క్రీజ్‌లో ఉన్నంత సేపు ప్రతి బంతికి భారీ షాట్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఓ రకంగా సఫలమయ్యాను.
స్పిన్నర్లకు ఈ ట్రాక్ చాలా ఉపయోగకరంగా ఉండింది. అందుకే ముందుగానే స్పిన్నర్లను బరిలోకి దించాలని అనుకున్నాము. లివింగ్‌స్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హాజిల్‌వుడ్ తన తొలి ఓవర్‌లో, ఆతర్వాత కొత్త బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ రెండు సందర్భాలు మ్యాచ్‌ను మాకు అనుకూలంగా మార్చాయి. మేము పరుగులు సాధించగలిగినా వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.