CSK Vs LSG: చెన్నై గెలిచిందోచ్‌... | IPL 2025 Chennai Super Kings Defeated The Lucknow Super Giants By 5 Wickets, Check Out Full Score Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2025 CSK Vs LSG: చెన్నై గెలిచిందోచ్‌...

Published Tue, Apr 15 2025 1:24 AM | Last Updated on Tue, Apr 15 2025 10:24 AM

IPL 2025: Chennai Super Kings defeated the Lucknow Super Giants by 5 wickets

సూపర్‌ కింగ్స్‌కు కీలక విజయం

5 వికెట్లతో లక్నో ఓటమి 

రాణించిన జడేజా, నూర్, దూబే

మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కాస్త ఊరట... వరుసగా ఐదు పరాజయాల తర్వాత పూర్తిగా ఆట మరచినట్లు కనిపించిన జట్టు ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థి లక్నోను ఆ జట్టు వేదికపైనే స్పిన్‌తో కట్టడి చేసిన సీఎస్‌కే ఆ తర్వాత మరో మూడు బంతులు మిగిలి ఉండగా లక్ష్యం చేరింది.  

బౌలింగ్‌లో నూర్‌ అహ్మద్, రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించగా, బ్యాటింగ్‌లో శివమ్‌ దూబే రాణించాడు. అన్నింటికి మించి మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగా క్రీజ్‌లోకి వచ్చిన ధోని తడబాటు లేకుండా, దూకుడుగా ఆడి జట్టుకు అవసరమైన ‘విలువైన’ పరుగులు సాధించడం మరో సానుకూలాశం. మరోవైపు ‘హ్యాట్రిక్‌’ విజయాలతో జోరు మీద కనిపించిన లక్నో సమష్టి వైఫల్యంతో ఓటమిని ఆహా్వనించింది.  

లక్నో: ఐపీఎల్‌లో ఎట్టకేలకు మూడు వారాల విరామం తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) గెలుపు రుచి చూసింది. సోమవారం జరిగిన పోరులో సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెపె్టన్‌ రిషభ్‌ 
పంత్‌ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, మిచెల్‌ మార్‌‡్ష (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం చెన్నై 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. శివమ్‌ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలుపు దిశగా నడిపించగా, ఎమ్మెస్‌ ధోని (11 బంతుల్లో 26 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 28 బంతుల్లో అభేద్యంగా 57 పరుగులు జోడించారు.  

పంత్‌ హాఫ్‌ సెంచరీ... 
తొలి ఓవర్లోనే మార్క్‌రమ్‌ (6) అవుట్‌ కాగా, టోర్నీ ప్రస్తుత టాప్‌ స్కోరర్‌ నికోలస్‌ పూరన్‌ (8) కూడా విఫలం కావడంతో లక్నోకు సరైన ఆరంభం లభించలేదు. ఖలీల్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి మార్‌‡్ష జోరు ప్రదర్శించగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 42 పరుగులకు చేరింది. సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 80 స్ట్రయిక్‌రేట్‌తో 40 పరుగులే చేసిన పంత్‌ ఈ మ్యాచ్‌లో పట్టుదలగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్‌లో మార్‌‡్షను జడేజా వెనక్కి పంపగా... ఒవర్టన్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన ఆయుశ్‌ బదోని (17 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా జడేజా బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. అప్పటి వరకు మెరుగ్గానే ఆడిన పంత్‌ను చెన్నై స్పిన్నర్లు పూర్తిగా కట్టిపడేశారు. ముఖ్యంగా నూర్‌ బౌలింగ్‌లో 15 బంతులు ఆడిన పంత్‌ 10 బంతుల్లో సింగిల్‌ కూడా తీయలేకపోయాడు! అయితే ఆ తర్వాత పతిరణ ఓవర్లో 2 సిక్స్‌లు బాదడంతో 42 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. చివరి 3 ఓవర్లలో లక్నో 45 పరుగులు సాధించింది.  

కీలక భాగస్వామ్యం... 
2023 సీజన్‌ నుంచి చెన్నై జట్టుతో ఉన్న ఆంధ్ర ఆటగాడు షేక్‌ రషీద్‌ (19 బంతుల్లో 27; 6 ఫోర్లు)కు తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం లభించింది. కొన్ని చక్కటి షాట్లతో అతను ఆకట్టుకున్నాడు. ఆకాశ్‌దీప్‌ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను, శార్దుల్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టడం విశేషం. అయితే అవేశ్‌ ఓవర్లో భారీ షాట్‌ ఆడే క్రమంలో అతని ఇన్నింగ్స్‌ ముగిసింది. మరో ఎండ్‌లో రచిన్‌ రవీంద్ర (22 బంతుల్లో 37; 5 ఫోర్లు) కూడా వేగంగా ఆడటంతో పవర్‌ప్లేలో చెన్నై 59 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత తక్కువ వ్యవధిలో జట్టు రచిన్, త్రిపాఠి (9), జడేజా (7), విజయ్‌శంకర్‌ (9) వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు రావడం కూడా కష్టంగా మారిపోయింది. విజయానికి 30 బంతుల్లో 56 పరుగులు కావాల్సిన స్థితిలో దూబే, ధోని జత కలిశారు. తాను ఆడిన తొలి బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్స్‌ బాది ధోని దూకుడు ప్రదర్శించడంలో ఒత్తిడి కాస్త తగ్గింది. చివరి 2 ఓవర్లలో 24 పరుగులు అవసరమయ్యాయి. శార్దుల్‌ వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ సహా 19 పరుగులు రాబట్టి విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్న చెన్నై... మరో మూడు బంతుల్లో లాంఛనం పూర్తి చేసింది.  

IPL 2025:  లక్నోపై చెన్నై విజయం



స్కోరు వివరాలు  
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) త్రిపాఠి (బి) అహ్మద్‌ 6; మార్‌‡్ష (బి) జడేజా 30; పూరన్‌ (ఎల్బీ) (బి) కంబోజ్‌ 8; పంత్‌ (సి) ధోని (బి) పతిరణ 63; బదోని (స్టంప్డ్‌) ధోని (బి) జడేజా 22; సమద్‌ (రనౌట్‌) 20; మిల్లర్‌ (నాటౌట్‌) 0; శార్దుల్‌ (సి) రషీద్‌ (బి) పతిరణ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–6, 2–23, 3–73, 4–105, 5–158, 6–158, 7–166. బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4–0–38–1, అన్షుల్‌ కంబోజ్‌ 3–0–20–1, ఒవర్టన్‌ 2–0–24–0, జడేజా 3–0–24–2, నూర్‌ అహ్మద్‌ 4–0–13–0, పతిరణ 4–0–45–2. 

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రషీద్‌ (సి) పూరన్‌ (బి) అవేశ్‌ 27; రచిన్‌ (ఎల్బీ) (బి) మార్క్‌రమ్‌ 37; రాహుల్‌ త్రిపాఠి (సి అండ్‌ బి) రవి బిష్ణోయ్‌ 9; జడేజా (సి) మార్క్‌రమ్‌ (బి) రవి బిష్ణోయ్‌ 7; శివమ్‌ దూబే (నాటౌట్‌) 43; విజయ్‌శంకర్‌ (సి) అవేశ్‌ (బి) దిగ్వేశ్‌ రాఠీ 9; ధోని (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–52, 2–74, 3–76, 4–96, 5–111. బౌలింగ్‌: శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–56–0, ఆకాశ్‌దీప్‌ 1–0–13–0, దిగ్వేశ్‌ రాఠీ 4–0–23–1, అవేశ్‌ ఖాన్‌ 3.3–0–32–1, రవి బిష్ణోయ్‌ 3–0–18–2, మార్క్‌రమ్‌ 4–0–25–1.  

ఐపీఎల్‌లో నేడు
పంజాబ్‌ X కోల్‌కతా 
వేదిక: ముల్లాన్‌పూర్‌

రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement