
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో నిన్న (మార్చి 24) అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. విశాఖ వేదికగా ఢిల్లీ, లక్నో హోరాహోరీగా తలపడ్డాయి. అంతిమంగా ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 72; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 75; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
అనంతరం ఛేదనలో ఆదిలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఆశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడటంతో సంచలన విజయం సాధించింది. 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తున్న ఢిల్లీని అశుతోష్.. అరంగేట్రం ఆటగాడు విప్రాజ్ నిగమ్ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) సాయంతో గెలిపించాడు. అశుతోష్ నమ్మశక్యంకాని రీతిలో షాట్లు ఆడి ఢిల్లీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
అశుతోష్ లోయర్ మిడిలార్డర్‌లో వచ్చి ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడటం ఇది మొదటిసారి కాదు. గత సీజన్‌లో అతను పంజాబ్ కింగ్స్ తరఫున ఇలాంటి ఇన్నింగ్స్‌లు చాలా ఆడాడు. అయితే గత సీజన్‌లో అశుతోష్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా తన జట్టును గెలిపించలేకపోయాడు. తద్వారా అతనికి గుర్తింపు దక్కలేదు.
ఈ సీజన్‌లో సీన్ మారింది. ఢిల్లీ తరఫున తొలి మ్యాచ్‌లోనే అశుతోష్ తన సహజ శైలిలో రెచ్చిపోయాడు. గత సీజన్ వీకనెస్‌ను (చివరి దాకా క్రీజ్‌లో నిలబడటం) అధిగమించి చివరి దాకా క్రీజ్‌లో నిలబడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. మ్యాచ్ అనంతరం అశుతోష్ ఓ విషయాన్ని ప్రస్తావించాడు. తన మెంటార్ శిఖర్ ధవన్ సలహాలతో గత సీజన్ లోపాలను అధిగమించానని చెప్పుకొచ్చాడు. ఇందు కోసం చాలా కష్ట పడ్డానని తెలిపాడు.
అశుతోష్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అనంతరం అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ అశుతోష్ మామూలోడు కాదంటూ కితాబునిస్తున్నారు. 26 ఏళ్ల అశుతోష్ మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో జన్మించాడు. అశుతోష్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ (రైట్ ఆర్మ్ మీడియం పేసర్) కూడా చేయగలడు.
దేశవాలీ టీ20ల్లో అశుతోష్‌కు ఓ అద్భుతమైన రికార్డు ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో అతను 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇదే ఫాసెస్ట్ హాఫ్ సెంచరీ.
అశుతోష్‌లోని హార్డ్ హిట్టింగ్ టాలెంట్ చూసి 2024 వేలంలో పంజాబ్ అతన్ని 20 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే పంజాబ్ అశుతోష్‌ను ఈ ఏడాది మెగా వేలానికి ముందు వదిలేసింది. అశుతోష్ గురించి ముందే తెలిసిన శిఖర్ ధవన్ అతన్ని ఢిల్లీ యాజమాన్యానికి సిఫార్సు చేశాడు. ఢిల్లీ అతన్ని మెగా వేలంలో రూ. 3.8 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.
గత సీజన్‌లో అశుతోష్ ఆడిన కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు..
గుజరాత్‌పై 17 బంతుల్లో 31
సన్‌రైజర్స్‌పై 15 బంతుల్లో 33 నాటౌట్
రాజస్థాన్‌పై 16 బంతుల్లో 31
ముంబై ఇండియన్స్‌పై 28 బంతుల్లో 61